Hyderabad Tunnel Route : హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. సొరంగ మార్గంతో ట్రాఫిక్ కష్టాలకు చెక్
Hyderabad Tunnel Route : హైదరాబాద్‌లో ఉన్న ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నగర జనాభా రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో ట్రాఫిక్ నియంత్రణ కష్టతరంగా మారింది. ఇక వర్షాకాలం వచ్చిదంటే నగరవాసులకు నరకం కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏ ప్రభుత్వం పెద్దగా చర్యలు చేపట్టలేదు. అండర్ పాసులు, ఫ్లై ఓవర్లు తక్కువగా నిర్మాణం జరిపారు. అయినప్పటికీ ట్రాఫిక్ కష్టాలు తీరలేదు. దీంతో ప్రభుత్వం తాజాగా సొరంగమార్గం గుండా రోడ్డు వేసి ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని ఆలోచన చేసినట్టు తెలుస్తోంది.
Hyderabad Tunnel Route : ఎన్ఎఫ్సిఎల్ టు దుర్గం చెరువు..
ముఖ్యంగా నగరంలో కేబీఆర్ పార్కు చుటూ ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు సొరంగ మార్గం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. 4 నెలల కిందట ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు చేసిన అధికారులు ఫీజిబిలిటీ స్టడీ,డీపీఆర్‌ల కోసం కన్సల్టెంట్లను ఆహ్వానిస్తూ ఇంటర్నేషనల్ స్థాయి టెండర్లను పిలిచారు.3 సంస్థలు బిడ్లు వేయగా.. ఎల్1గా నిలిచిన ఆర్వీ అసోసియేట్స్ ఆర్కిటెక్ట్స్ ఇంజినీర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్‌కు పనులు అప్పగిచేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. అయితే, నాలుగు నెలలైనా ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదు. తాజాగా దీనికి ఆమోదం లభించింది.తొలిదశలో ఫీజిబిలిటీ స్టడీ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం పరిశీలన అనుమతులు వచ్చాకే డీపీఆర్ తయారీ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
ఫీజిబిలిటీ స్టడీ నివేదికను 6 నెలల్లో అందించాల్సి ఉండగా..డీపీఆర్ కోసం మరో 3 నెలల టైం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ముందుగా నగరంలోని ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ నుంచి వయా కేబీఆర్ పార్కు మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 జంక్షన్, అక్కడి నుంచి దుర్గం చెరువును అత్యధిక ట్రాఫిక్ జోన్‌గా గుర్తించారు.కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిగ్నల్ ఫ్రీ ప్రయాణానికి సొరంగం మార్గం ఆలోచన చేశారు. హైవేమార్గంలో ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా సొరంగ మార్గానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇది టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) ద్వారా నిర్మించనున్నట్టు సమాచారం. మొత్తంగా నగరంలో తొలివిడతగా 6.3 కిమీలు సొరంగమార్గం నిర్మాణం జరగనుందని తెలుస్తోంది.