Home » News » Karthika Deepam 2 March 16th 2026 Today Monday Episode Highlights
News

Karthika Deepam 2 March 16 Today Episode : దీపకు మరణ గండం.. బిడ్డను వద్దనుకున్న కార్తీక్.. గుండె పగిలేలా సుమిత్ర ఆవేదన!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: March 16, 2026 8:11 am
Advertisement

Karthika Deepam 2 March 16 Today Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 సీరియల్ రోజుకో సరికొత్త మలుపుతో ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోంది. పాత కార్తీక దీపం సీరియల్ కు ఏమాత్రం తీసిపోకుండా, ఉత్కంఠభరితమైన ఎపిసోడ్స్ తో రేటింగ్స్ లో దూసుకుపోతోంది. ముఖ్యంగా దీప, కార్తీక్ ల మధ్య బంధం, సుమిత్ర ఎమోషన్స్, జ్యోత్స్న కుట్రలు సీరియల్ ను రసవత్తరంగా మార్చాయి. ఈరోజు (మార్చి 16) ప్రసారమైన ఎపిసోడ్ లో ఊహించని షాకింగ్ ట్విస్టులు చోటుచేసుకున్నాయి. దీప తన బిడ్డను వద్దనుకోవడం, మరోవైపు దీపకు మరణ గండం ఉందని గురువు గారు చెప్పడం ప్రేక్షకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Karthika Deepam 2 March 16 Today Episode : దీపకు మరణ గండం.. బిడ్డను వద్దనుకున్న కార్తీక్.. గుండె పగిలేలా సుమిత్ర ఆవేదన!

Karthika Deepam 2 March 16 Today Episode సుమిత్ర ముందు దీపను ఇరికించిన జ్యోత్స్న

హాస్పిటల్ లో ఉన్న సుమిత్రను పలకరించడానికి దీప, కార్తీక్, దశరథ్ వెళ్తారు. అయితే, దీపను చూడగానే సుమిత్రకు కోపం వస్తుంది. “నువ్వేంటి ఇక్కడున్నావ్? నిన్ను హాస్పిటల్లో చేర్పించారని విన్నాను. నన్ను చూడటానికి వచ్చావా ఏంటీ? కడుపుతో ఉన్నదానివి నువ్వు రావడం ఎందుకు? ఫోన్ చేస్తే సరిపోయేది కదా” అని సుమిత్ర అంటుంది. అంతేకాకుండా, “టెస్టులన్నీ చేయించుకున్నావా? కడుపులో బిడ్డ క్షేమంగా ఉందా?” అని ఎంతో ప్రేమగా అడుగుతుంది. అక్కడే కాచుకుని ఉన్న జ్యోత్స్న వెంటనే కల్పించుకుని తన విషపు మాటలతో సుమిత్ర మనసులో చిచ్చు పెడుతుంది. “బిడ్డ క్షేమం గురించి నువ్వు ఎన్ని సార్లు అడిగినా దీప సమాధానం చెప్పలేదు మమ్మీ. ఎందుకంటే దీప తన బిడ్డను వదిలేసుకుంటుంది. తనకు పిల్లలు వద్దంట. ఈ కడుపు భారంగా ఉందంట. ఈ బరువు దించేసుకోవాలని హాస్పిటల్లో చేరింది” అని జ్యోత్స్న బాంబు పేల్చుతుంది. ఆ మాట వినగానే సుమిత్రకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అవుతుంది. దీప ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే ఆమె అసలు నమ్మలేకపోతుంది.

Advertisement

Karthika Deepam 2 March 16 Today Episode జ్యోత్స్నపై కార్తీక్ ఫైర్.. ఎవరికీ భయపడేది లేదు!

జ్యోత్స్న మాటలకు కార్తీక్ తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. “నా భార్య, నా బిడ్డ, నా ఇష్టం. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. నేను ఏం చేసుకున్నా అడిగే అధికారం ఎవ్వరికీ లేదు” అని కార్తీక్ కరాఖండీగా చెబుతాడు. అయినా సరే జ్యోత్స్న ఊరుకోకుండా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. “చూశావా మమ్మీ, అత్తని కూడా ఇలాగే నోరు మూయించాడు. ఈ దీప ఎప్పుడూ ఎవరో ఒకరి చావును కోరుకుంటూనే ఉంది. ఒకప్పుడు మా డాడీని చంపాలనుకుంది. అయినా మా వాళ్లకు సిగ్గు లేదు కాబట్టి నమ్మి ఇంట్లో అడుగుపెట్టనిచ్చారు” అని జ్యోత్స్న విరుచుకుపడుతుంది. జ్యోత్స్న మాటలకు కార్తీక్ కౌంటర్ ఇస్తూ.. “అలా అయితే సిగ్గు లేనిది నీకే. అగ్రిమెంట్ పేరుతో ఇంట్లో ఉండే పర్మిషన్ ఇచ్చింది నువ్వే కదా” అని అంటాడు. “మీలా నేను మనుషులను చంపే రకం కాదు” అని జ్యోత్స్న అనగానే.. “కారుతో, లారీతో గుద్దేయడం మాకే అలవాటు మరి” అని పారిజాతాన్ని ఉద్దేశించి కార్తీక్ వ్యంగ్యంగా అంటాడు. దీంతో పారిజాతం వణికిపోతుంది. ఎంత చెప్పినా జ్యోత్స్న ఆగకపోవడంతో దశరథ్ అరుస్తాడు.

కన్నీరుమున్నీరైన సుమిత్ర.. దీపపై ప్రశ్నల వర్షం

దీప నిర్ణయాన్ని జీర్ణించుకోలేని సుమిత్ర.. దీపను నిలదీస్తుంది. “నీ భార్య వద్దంటుందా? నువ్వే వద్దనుకుంటున్నావా?” అని కార్తీక్ ను అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శివ నారాయణ.. “వాళ్లు మనకు ఏం చెప్పరు. వీళ్లకు మన అవసరం లేదు” అని అంటాడు. జ్యోత్స్న మళ్లీ కల్పించుకుని.. “ఇలాంటి పని చేయొద్దని నువ్వైనా దీపకు చెప్పు మమ్మీ, పైగా తనకు మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు” అని మరింత బాధపెడుతుంది. సుమిత్ర ఎంతో ఎమోషనల్ అవుతూ.. “జ్యోత్స్న నా కూతురు. నా ప్రాణం. దీన్ని ఎవరైనా దూరం చేస్తే నేను బతుకుతానా? నేను నా బిడ్డను ఇంత ప్రాణంగా ప్రేమిస్తుంటే నువ్వేంటి దీప నీ బిడ్డను అంత తేలికగా వదిలేసుకుంటున్నావ్. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ దీప” అని దగ్గుతూ బాధపడుతుంది. ఆ పరిస్థితి చూసి దశరథ్ అందరినీ బయటకు పంపిస్తాడు. “దీప కడుపులో బిడ్డ బతకాలండీ, అది ఈ లోకం చూడాలి” అని సుమిత్ర దశరథ్ తో చెప్తుంది. తన మనసులో దీప కోసం త్యాగం చేస్తున్నట్లు దశరథ్ ఫీల్ అవుతాడు.

Advertisement

కాంచన కన్నీటి శోకం.. కార్తీక్ పై శ్రీధర్ అనుమానం

మరోవైపు తన కొడుకు తీసుకున్న నిర్ణయానికి కాంచన కుమిలిపోతుంది. కడుపు శోకంతో రగిలిపోతున్న ఆమెను శ్రీధర్ ఓదారుస్తాడు. “వాడిని నాతో మాట్లాడొద్దని చెప్పు. భార్య బిడ్డను మోయలేనంది, వీడు సరేనన్నాడు. వీడికి భార్య సంతోషంగా ఉంటే చాలు, కన్నతల్లి అవసరం లేదు” అని కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. శ్రీధర్ కూడా కార్తీక్ పై సీరియస్ అవుతాడు. “కార్తీక్ అంటే ఆకాశం అనుకున్నాను. కానీ నేల మీదకు దిగిపోయావు. నువ్వు నీ బిడ్డను వద్దనుకున్నావు కానీ నేను నా బిడ్డను వద్దనుకోలేదు కదా. నీలా వదిలేసుకునే తండ్రిని కాదు నేను” అని అంటాడు. అయితే శ్రీధర్ కు కార్తీక్ మీద ఒక నమ్మకం ఉంటుంది. “నా కొడుకు ఏ పని చేసినా ఆలోచించే చేస్తాడు. నువ్వు చెప్తున్న దాని వెనుక ఏదో బలమైన కారణం ఉందనిపిస్తుంది. నువ్వు బయటకు చెప్పుకోలేక మోస్తున్న ఆ భారం ఏంటీ?” అని కార్తీక్ ను శ్రీధర్ నిలదీస్తాడు. దానికి కార్తీక్ సమాధానం దాటవేస్తూ.. “అదేంటో నువ్వే తెలుసుకో మాస్టారు” అని వెళ్లిపోతాడు. ఆ కారణం ఏంటో తాను కనుక్కుంటానని శ్రీధర్ ఛాలెంజ్ చేస్తాడు.

దీపకు మరణ గండం.. గురువు చెప్పిన షాకింగ్ నిజం!

ఇంట్లో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర ఆందోళనకు గురైన దశరథ్.. గుడికి వెళ్లి గురువుగారిని కలుస్తాడు. దీప జాతకాన్ని చూపించి ఆమె భవిష్యత్ ఎలా ఉండబోతుందో చెప్పమని అడుగుతాడు. జాతకం పరిశీలించిన గురువు గారు చెప్పిన నిజం విని దశరథ్ గుండె ఆగినంత పనవుతుంది. “ఈ జాతకం కలిగిన వ్యక్తి చావు ముంగిట్లో ఉంది. మరణ గండం ఉంది. తన ఉనికే తనకు ప్రమాదం. ప్రస్తుతం నడుస్తున్న రోజులన్నీ ముళ్ల మీద నడక లాంటివి. రాబోయే ప్రమాదం నుంచి ఈ మనిషి తప్పించుకోలేదు. ఒకరి అసూయ, ద్వేషాలే ఇంకొకరికి గండంగా మారొచ్చు. ఇప్పుడు మీరు ఊహించిన స్థాయి కంటే ప్రమాదస్థాయి చాలా పెద్దది. ప్రమాదం తప్పదు” అని గురువు గారు ఖరాఖండిగా చెబుతారు. దీంతో దీప ప్రాణాలకు ఎవరి వల్ల ముప్పు ఉందనేది ఇప్పుడు అతిపెద్ద సస్పెన్స్ గా మారింది.

కార్తీక్, దీపల రహస్య ఒప్పందం

ఎపిసోడ్ చివరలో దీప, కార్తీక్ లు ఒంటరిగా మాట్లాడుకుంటారు. తన వల్లే కార్తీక్ ఈ నిందలన్నీ భరిస్తున్నాడని దీప ఎంతో బాధపడుతుంది. “అవసరం నాది, నిందలు నువ్వు పడుతున్నావు బావ. నేను నీకు చాలా పెద్ద అన్యాయం చేస్తున్నాను” అని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. దానికి కార్తీక్ ధైర్యం చెబుతూ.. “వాళ్లకు పూర్తిగా నిజం తెలియదు కాబట్టి అపార్థం చేసుకుంటున్నారు. మనం తీసుకున్న నిర్ణయం మీద నిలబడాల్సిందే. ఆపరేషన్ జరిగేంత వరకు ఎన్ని అవమానాలైనా మనం మోయాలి దీప” అని భరోసా ఇస్తాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో ఏం జరగనుంది?

దీపకు ఉన్న మరణ గండం ఎవరి వల్ల? జ్యోత్స్న పన్నిన కుట్రల వల్ల దీప ప్రాణాలకే ముప్పు వాటిల్లనుందా? దీపను, బిడ్డను కార్తీక్ ఎలా కాపాడుకోబోతున్నాడు? సుమిత్రకు ఈ నిజాలన్నీ తెలిస్తే ఏమవుతుంది? అన్నది రాబోయే ఎపిసోడ్స్ లో అత్యంత ఉత్కంఠభరితంగా మారనుంది.

Advertisement

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి