January 12 Vidudala Movie : జనవరి 12 విడుదల.. వెంకీ–అనిల్ రావిపూడి మూవీ క్రేజీ టైటిల్ ఇదే !
January 12 Vidudala Movie : తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాల్లో వినోదానికి పెద్దపీట వేయడంతో పాటు, ప్రతి కథను తనదైన శైలిలో కొత్తగా ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కథ, కథనాల ఎంపికతో పాటు హీరోలను ఎంచుకునే విషయంలోనూ అనిల్ రావిపూడి చూపించే వైవిధ్యం ప్రత్యేకంగా నిలుస్తోంది. అందుకే ఆయన సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడటంతో పాటు, కొత్త సినిమా ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటోంది. ప్రతి సినిమాను కొత్తగా ప్రమోట్ చేయడంలో అనిల్ రావిపూడి తనదైన మార్క్ చూపిస్తున్నారు. సినిమా కథకు తగ్గట్టుగా వినూత్నమైన ప్రమోషనల్ కంటెంట్‌ను రూపొందిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా విక్టరీ వెంకటేశ్, కల్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతిశెట్టి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన టైటిల్‌ను కూడా ఆయన చాలా ఆసక్తికరంగా ప్రకటించారు. టైటిల్‌ను ప్రకటించిన విధానం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
January 12 Vidudala Movie : జనవరి 12 విడుదల.. వెంకీ–అనిల్ రావిపూడి మూవీ క్రేజీ టైటిల్ ఇదే !
January 12 Vidudala Movie F2 నుంచి మన శంకర వరప్రసాద్ గారు వరకు.. టైటిల్స్‌లోనూ అనిల్ మార్క్
అనిల్ రావిపూడి సినిమాల విషయంలో టైటిల్స్‌కు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. F2: Fun and Frustration నుంచి మన శంకర వరప్రసాద్ గారు వరకు ఆయన ఎంచుకున్న టైటిల్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచినవే. కథలోని వినోదాన్ని టైటిల్‌లోనే ప్రతిబింబించేలా చేయడం ఆయన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అందుకే ఆయన కొత్త సినిమా టైటిల్ ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి మొదటి నుంచే నెలకొంది. ఈ క్రమంలోనే తన తాజా చిత్రానికి “జనవరి 12 విడుదల” అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌ను కూడా సాధారణంగా ప్రకటించకుండా, తనదైన స్టైల్‌లో వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్‌లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సినిమాలో బ్రహ్మానందంపై చిత్రీకరించిన సన్నివేశాన్ని పరిచయం చేస్తూ వెంకటేశ్, కల్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతిశెట్టిని ఆటపట్టించేలా వీడియోను రూపొందించారు. సినిమాలో టైటిల్ ఏమిటంటూ వారు అడిగిన సందర్భంలో.. “జనవరి 12 విడుదల.. బావ బామ్మర్ధి సౌజన్యంతో” అంటూ టైటిల్‌ను ప్రకటించారు. ఈ సరదా టైటిల్ అనౌన్స్‌మెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
January 12 Vidudala Movie సన్‌షైన్ బ్యానర్‌పై భారీగా తెరకెక్కుతున్న సినిమా
“జనవరి 12 విడుదల” సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్‌షైన్ బ్యానర్‌పై పాపులర్ నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. టెక్నికల్ టీమ్‌లో సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకటేశ్, కల్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతిశెట్టి కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అనిల్ రావిపూడి కెరీర్‌ను పరిశీలిస్తే.. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన ఆ తర్వాత వరుస విజయాలతో తన సత్తా చాటుకున్నారు. సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. వినోదాత్మక కథలను తనదైన శైలిలో తెరకెక్కిస్తూ వరుస విజయాలను అందుకున్న ఆయన.. ఇప్పుడు సంక్రాంతి 2027 సందర్భంగా “జనవరి 12 విడుదల” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈసారి వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ ఎలాంటి వినోదాన్ని అందించబోతుందో చూడాలి.
