Home » News » Bollapalli Srikanth Success Story
News

Success Story : కూలీ నుంచి కోట్ల టర్నోవర్ .. తెలంగాణ వాసీ విజయ గాథ.. తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే..!

Authored By
Suma
The Telugu News | Updated on: February 11, 2026 12:43 pm
Advertisement

Success Story : జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే ఉన్నత విద్య, విదేశీ డిగ్రీలు తప్పనిసరి అని చాలా మంది భావిస్తారు. కానీ కష్టపడే నైజం, పట్టుదల, స్పష్టమైన లక్ష్యం ఉంటే చదువు ఎంతవరకు ఉన్నా పెద్ద విషయం కాదని తెలంగాణకు చెందిన బొల్లపల్లి శ్రీకాంత్ తన జీవితం ద్వారా నిరూపించారు. ఒకప్పుడు రోజుకు 18 గంటలు పొలంలో కూలీగా పనిచేసిన యువకుడు నేడు ఏడాదికి రూ. 70 కోట్ల టర్నోవర్ సాధించే వ్యాపారవేత్తగా ఎదిగారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఆయన స్వగ్రామం. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శ్రీకాంత్ చిన్నప్పటి నుంచే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుటుంబం అప్పుల్లో ఉండటంతో పదో తరగతి తర్వాత చదువును కొనసాగించలేకపోయారు. కేవలం 16 ఏళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుని ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లారు. అక్కడ నెలమంగళ ప్రాంతంలోని పూల తోటల్లో నెలకు వెయ్యి రూపాయల జీతంతో కూలీగా చేరారు. ఎండైనా, వానైనా లెక్కచేయకుండా రోజుకు 18 గంటల పాటు శ్రమించారు. ఆ కష్టకాలాన్నే ఆయన “స్ట్రీట్ సైడ్ MBA”గా అభివర్ణిస్తారు. పుస్తకాలలో లభించని వ్యాపార పాఠాలు జీవితమే నేర్పిందని చెబుతుంటారు.

Advertisement

Success Story : కూలీ నుంచి కోట్ల టర్నోవర్ .. తెలంగాణ వాసీ విజయ గాథ.. తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే..!

Success Story : రూ.20 వేలతో మొదలైన వ్యాపారం… కోట్ల టర్నోవర్ దిశగా దూసుకెళ్లిన అడుగులు

కూలీగా పని చేస్తూనే పూల మార్కెట్‌లో జరిగే కొనుగోలు, అమ్మకాలు, ధరల మార్పులు, డిమాండ్ వంటి విషయాలను గమనించిన శ్రీకాంత్‌లో వ్యాపార ఆలోచన మొలకెత్తింది. 1997లో, తన 18వ ఏట కేవలం రూ. 20,000 పెట్టుబడితో చిన్న పూల దుకాణాన్ని ప్రారంభించారు. ప్రారంభంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. కస్టమర్ల విశ్వాసం సంపాదించడంపై దృష్టి పెట్టారు. అద్భుతమైన సేవ, నాణ్యమైన పూల సరఫరా వల్ల మొదటి ఏడాదిలోనే రూ. 5 లక్షల టర్నోవర్ సాధించారు. ఈ విజయం ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. క్రమంగా వ్యాపారాన్ని విస్తరించి  కొత్త మార్కెట్లను అందిపుచ్చుకున్నారు. 25 ఏళ్ల వయసు వచ్చే సరికి ఆయన వ్యాపారం రూ. 5 కోట్ల టర్నోవర్ దాటింది. కూలీగా ప్రారంభమైన జీవితం, వ్యాపార రంగంలో విజయపథంలో దూసుకెళ్లింది.

Advertisement

Success Story : హైటెక్ పూల సాగుతో అంతర్జాతీయ మార్కెట్ దాకా

వ్యాపారంలో స్థిరపడిన తర్వాత శ్రీకాంత్ 2005లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం వ్యాపారి కాకుండా స్వయంగా సాగుదారుడిగా మారాలని సంకల్పించారు. బెంగళూరు శివార్లలో భూమిని సేకరించి ‘వెన్సాయ్ ఫ్లోరిటెక్’ అనే సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ సుమారు 70 ఎకరాల్లో అత్యాధునిక సాంకేతికతతో పూల సాగు చేస్తోంది. గులాబీలు, జెర్బెరా, కార్నేషన్ వంటి దాదాపు 20 రకాల పూలను ఇక్కడ పండిస్తున్నారు. అంతేకాకుండా తన కుమార్తె పేరుతో ‘మోక్ష శ్రీ’ అనే ప్రత్యేక జెర్బెరా రకాన్ని అభివృద్ధి చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆటోమేటెడ్ ఇరిగేషన్ వ్యవస్థలు, క్లైమేట్ కంట్రోల్ పాలీహౌస్‌లు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలను వినియోగిస్తున్నారు. దీంతో నాణ్యమైన పూల ఉత్పత్తి సాధ్యమైంది. నేడు ఆయన పూలు దేశంలోని ప్రధాన నగరాలకు మాత్రమే కాకుండా దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. సాధారణ కూలీ నుంచి కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగిన బొల్లపల్లి శ్రీకాంత్ గాథ పట్టుదల ఉంటే అసాధ్యం ఏదీ లేదని మరోసారి గుర్తుచేస్తోంది.

 

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి