Irumudi Movie Review : రవితేజ ఇరుముడి రివ్యూ అండ్ రేటింగ్‌..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on: September 4, 2026, 10:14 am
  •  Irumudi Movie Review ఇరుముడి మూవీ రివ్యూ, రవితేజ ఇరుముడి రివ్యూ, ఇరుముడి ట్విట్టర్ రివ్యూ, ఇరుముడి పబ్లిక్ టాక్, రవితేజ మూవీ రివ్యూ , ఇరుముడి సినిమా స‌మీక్ష , Irumudi Review, Irumudi movie review, Ravi Teja Irumudi, Irumudi Twitter Review, Irumudi Public Talk, Ravi Teja Movie Review

మాస్ మహారాజ్ రవితేజ సినిమా అంటేనే లవ్, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్, కామెడీకి మాస్ టచ్ గుర్తొస్తుంది. తెరపై ఆయన పాత్ర కూడా సాధారణంగా జోష్, హుషారు, సరదా, సందడితో సాగుతుంటుంది. అయితే ఈసారి రవితేజ పూర్తిగా భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దర్శకుడు శివ నిర్వాణ రాసుకున్న కథలో డివోషనల్ టచ్‌తో పాటు తండ్రీకూతుళ్ల అనుబంధం, ఆడపిల్లల భద్రత, భావోద్వేగాలు, యాక్షన్‌ను మేళవించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఇరుముడి’ ఈరోజే థియేటర్లలో విడుదలైంది. వరుస ఫ్లాపుల తర్వాత రవితేజకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది? సినిమా ఎలా ఉందో చూద్దాం.

త్రినాథ్ (రవితేజ), ఆయన భార్య కావేరి (ప్రియా భవాని శంకర్) ‘పొల్లూరు’ అనే గ్రామంలో జీవిస్తుంటారు. వారికి ఉన్న ఏకైక సంతానం మణెమ్మ (బేబీ నక్షత్ర). త్రినాథ్‌కు రెండు ఎకరాల అరటి తోట ఉంటుంది. దాని ద్వారా వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తూ సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు.త్రినాథ్‌కు గురుస్వామి (సాయికుమార్) అంటే ప్రత్యేకమైన అభిమానం. త్రినాథ్‌ను అయ్యప్ప స్వామి భక్తి వైపు నడిపించింది కూడా ఆయనే. అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్లే తనకు కూతురు పుట్టిందని త్రినాథ్ బలంగా నమ్ముతాడు. అందుకే ప్రతి ఏడాది అయ్యప్ప దీక్ష తీసుకుని శబరిమలకు వెళ్తుంటాడు.మణెమ్మ అంటే త్రినాథ్‌కు ప్రాణం. కూతురికి ఇచ్చిన మాట కోసం చివరికి మందు కూడా మానేస్తాడు. ప్రతిరోజూ తన జీవితంలో ఏం జరిగిందో తండ్రికి చెప్పడం మణెమ్మకు అలవాటు. ఏ విషయాన్నీ దాచకుండా తండ్రితో పంచుకుంటుంది. దీంతో తన వెనుక ఎప్పుడూ తండ్రి అండగా ఉంటుందనే ధైర్యం ఆ చిన్నారిలో ఏర్పడుతుంది.ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించే ధనలక్ష్మి (శ్వాసిక) అదే ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా వస్తుంది. మణెమ్మ, గురుస్వామి కుమార్తె గాయత్రితో కలిసి స్కూల్‌కు వెళ్లి వస్తుంటుంది.

మరోవైపు గ్రామంలో ఎర్రాజీ (అజయ్ ఘోష్) కుమారుడు నాగులు రౌడీయిజం చేస్తుంటాడు. పిల్లలు స్కూల్‌కు వెళ్లే దారిలో ‘డొంకరాయి’ అనే మరో గ్రామం ఉంటుంది. అక్కడ కొందరు పోకిరీలు మకాం వేసి ఆడపిల్లలను వేధిస్తుంటారు. గ్రామంలోని ప్రతి ఆడపిల్లనూ తన కూతురిగానే భావించే త్రినాథ్.. టీచర్ల నుంచి దారికాసే పోకిరీల వరకు, పెద్ద మనుషుల ముసుగులో తిరిగే ప్రమాదకర వ్యక్తుల నుంచి ఆ పిల్లలను ఎలా కాపాడాడు? అందుకోసం అతను ఎలాంటి పోరాటం చేశాడు? అనేదే అసలు కథ.

కూతురే ప్రపంచంగా బతికే తండ్రి.. కథలో అసలు ఎమోషన్ ఇదే

ప్రతి తండ్రికి తన కూతురే ప్రపంచం. ఆమె తర్వాతే మిగతా ప్రపంచం.. అవసరమైతే తనను కూడా పక్కన పెట్టి కూతురి కోసం జీవించే తండ్రులు ఎంతోమంది ఉంటారు. ‘ఏం కావాలమ్మా?’ అని తరచూ అడిగే తండ్రులు.. ‘ఈరోజు ఏం జరిగింది? ఎవరైనా భయపెట్టారా? ఎవరైనా బెదిరించారా? అలాంటి సంఘటన ఏదైనా ఎదురైందా?’ అని మాత్రం అడగడం చాలాసార్లు మరిచిపోతుంటారు.అలాంటి ప్రశ్నలు అడగడం అలవాటైతే, జరిగిన విషయాలను తండ్రితో చెప్పడం కూడా కూతురికి అలవాటవుతుందనే ఆలోచన చుట్టూనే ఈ సినిమా కథను దర్శకుడు నడిపించారు.కూతురే లోకంగా, కుటుంబమే సర్వస్వంగా భావించే త్రినాథ్.. తన గ్రామంలోని ఆడపిల్లలందరినీ కూడా తన కూతుళ్లుగానే చూస్తాడు. అలాంటి సమయంలో తన కూతురిపై కన్నేసిన శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తే అతను ఏం చేస్తాడు? ఇదే కథలోని ప్రధాన అంశం.గ్రామీణ ప్రాంతాల్లో మంచి మనుషులు ఎక్కువగానే ఉన్నా, అమాయకత్వం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లలంటే భయపడేలా చేయాలని చూసే మృగాలపై ఒక తండ్రి చేసే పోరాటమే ‘ఇరుముడి’లో ప్రధానంగా కనిపిస్తుంది.

సినిమాలో చెప్పుకోదగిన సన్నివేశాల్లో ఒకటి.. తాను అయ్యప్ప మాల ధరించిన సమయంలో తనపై దాడి చేసేందుకు శత్రువులు సిద్ధమవుతున్నారని త్రినాథ్ తెలుసుకుంటాడు. దీంతో ఊరి సెంటర్‌కు వచ్చి తనతో తలపడాలంటే అక్కడికే రావాలని, లేదంటే శరణాలు చెప్పి వెళ్లిపోవాలని చాటింపు వేయిస్తాడు. ఈ సన్నివేశం కొత్తగా, ఆసక్తికరంగా అనిపిస్తుంది.అలాగే రవితేజ నడిపే ట్రాలీ ఆటోను రౌడీ మూకలు వెంబడించే సన్నివేశం కూడా ఉత్కంఠగా సాగుతుంది. కూతురు నిద్రపోతోందని, అటువైపు నుంచి వెళ్లే వాహనాలు ఎవరూ హారన్ కొట్టకూడదనే సన్నివేశంతో రవితేజ పరిచయం అవుతాడు. కథ మొత్తం తిరిగి, ప్రీ క్లైమాక్స్‌కు ముందు అదే సన్నివేశం దగ్గరకు వస్తుంది. అయితే అప్పటికి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఆ సన్నివేశం భావోద్వేగంగా మనసును తాకుతుంది.త్రినాథ్ ప్రతిసారీ ‘స్వామి శరణం’ అంటూ యాక్షన్‌లోకి దిగే విధానం అభిమానులను, ప్రేక్షకులను ఉత్సాహపరుస్తుంది.

ఇక గ్రామంలోని ఆడపిల్లలు సురక్షితంగా ఉండాలంటే నాగులు బతకకూడదని భావించిన త్రినాథ్ అతడిని చంపేందుకు వెళ్తాడు. కానీ అనూహ్యంగా ఓ ముసుగు వ్యక్తి చేతిలో దారుణంగా హత్యకు గురవుతాడు. అసలు ఆ ముసుగు వ్యక్తి ఎవరు? నాగులను చంపాల్సిన అవసరం ఇంకెవరికి ఉంది? అనే ప్రశ్నలతో ప్రేక్షకులను ఆలోచనలో పడేసే సమయంలో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.సెకండాఫ్‌లో కథ మరింత వేగం పుంజుకుంటుంది. వరుస ట్విస్టులతో కథను ముందుకు తీసుకెళ్లడంతో పాటు యాక్షన్, ఎమోషన్ కలగలిసిన క్లైమాక్స్ ప్రేక్షకులను కదిలిస్తుంది. చివరి భాగంలోని కొన్ని సన్నివేశాల్లో తమిళ సినిమాల ఫ్లేవర్ కూడా కనిపిస్తుంది.

తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని దర్శకుడు తెరపై ఆవిష్కరించిన తీరు ఈ సినిమాకు ప్రధాన బలం. రవితేజ, సాయికుమార్, రమేశ్ ఇందిర, శ్వాసిక పాత్రలను ఈ కథకు నాలుగు ప్రధాన స్తంభాలుగా చెప్పొచ్చు. బేబీ నక్షత్ర తన పాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె నటన కూడా ప్రశంసలు అందుకునేలా ఉంది.సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. విష్ణు శర్మ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా హుషారును తీసుకొస్తాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా మెప్పిస్తుంది.

ఈ సినిమాలో మరో ముఖ్యమైన అంశం ఆడపిల్లల భద్రత. సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా చేసే మృగాలు అడవుల్లో మాత్రమే ఉండరు.. కొందరు వీధుల్లో, మరికొందరు ఖరీదైన కార్లలో తిరుగుతుంటారనే విషయాన్ని కథ గుర్తు చేస్తుంది. ఆడపిల్లలను పెంచడం అంటే వారి మనసుల్లో భయాన్ని నింపడం కాదు.. ధైర్యాన్ని నింపడం అనే సందేశాన్ని ఈ సినిమా బలంగా చెబుతుంది.

మొత్తంగా చూస్తే, ‘ఇరుముడి’ రవితేజ సాధారణ మాస్ ఫార్ములాకు కాస్త దూరంగా వెళ్లిన సినిమా. ఇందులో ఆయనను ఓ మాస్ హీరోగా కంటే సాధారణ ఆడపిల్ల తండ్రిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కథలోని కొత్తదనం, తండ్రీకూతుళ్ల ఎమోషన్, యాక్షన్, డివోషనల్ టచ్ సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. వరుస పరాజయాల తర్వాత రవితేజకు ఈ సినిమా మంచి ఊరటనిచ్చే విజయంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Irumudi Movie Review : మాస్ మహారాజ్ రవితేజ Ravi teja హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’. విలక్షణమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ప్రధానంగా తీసుకుని దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. రవితేజ కెరీర్‌లో మరో భిన్నమైన చిత్రంగా నిలుస్తుందనే అంచనాలతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్రమోషనల్ కంటెంట్ విడుదలైన తర్వాత రవితేజను ఇంతకుముందెన్నడూ చూడని విధంగా కొత్త కోణంలో చూడబోతున్నామనే క్యూరియాసిటీ అభిమానుల్లో పెరిగింది. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, స్వసికా విజయ్, సాయికుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ-సిరీస్ సమర్పణలో సినిమా తెరకెక్కగా.. శివ్ చనానా సహ నిర్మాతగా వ్యవహరించారు.టెక్నికల్ విభాగానికి వస్తే.. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు. సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైన్‌ బాధ్యతలు చేపట్టారు.

Irumudi Movie Review : రవితేజ ఇరుముడి రివ్యూ అండ్ రేటింగ్‌..!

Irumudi Movie Review : రవితేజ ఇరుముడి రివ్యూ అండ్ రేటింగ్‌..!

సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్ రూపొందించారు. విడుదలకు ముందే వచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్‌తో పాటు ఇతర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 21న ‘ఇరుముడి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? రవితేజ నటన ఎలా ఉంది? దర్శకుడు శివ నిర్వాణ కథను ఎలా నడిపించారు? ఫస్ట్ హాఫ్, సెకండాఫ్‌లో ఏ అంశాలు మెప్పించాయి? ట్విస్టులు, ఎమోషన్స్, క్లైమాక్స్ ఎలా ఉన్నాయి? అనే విషయాలపై ట్విట్టర్, సోషల్ మీడియా వేదికల్లో వచ్చిన రివ్యూలు ఆసక్తిని పెంచుతున్నాయి.

Irumudi Movie Review రవితేజ నటనకు ప్రశంసలు.. సెకండాఫ్ ట్విస్టులు, క్లైమాక్స్‌పై ప్రత్యేకంగా కామెంట్స్

ఒక ప్రేక్షకుడు ట్విట్టర్ వేదికగా ‘ఇరుముడి’పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ సినిమాకు 3/5 రేటింగ్ ఇచ్చారు. రవితేజ అందించిన సిన్సియర్ పెర్ఫార్మెన్స్ తనకు బాగా నచ్చిందని తెలిపారు. అలాగే సాయికుమార్ పవర్‌ఫుల్ డైలాగ్స్ కూడా సినిమాకు బలంగా నిలిచాయని ప్రశంసించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్, ‘మల్లెపూల పల్లకి’ యాక్షన్ బ్లాక్ థియేటర్లలో మంచి హై మూమెంట్‌గా నిలిచాయని పేర్కొన్నారు. అదే సమయంలో జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని ఆ ప్రేక్షకుడు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎమోషనల్ క్లైమాక్స్ కూడా మెప్పించిందని చెప్పారు. అయితే ట్విస్ట్ తర్వాత కథనం కొంత నెమ్మదించినట్లు అనిపించిందని, స్క్రీన్‌ప్లేను మరింత టైట్‌గా, కట్టుదిట్టంగా రూపొందించి ఉంటే సినిమా ఇంకా మెరుగ్గా ఉండేదని సూచించారు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. మంచి మెసేజ్‌తో ‘ఇరుముడి’ ఆకట్టుకునే సినిమాగా అనిపించిందని తన రివ్యూలో పేర్కొన్నారు.

మరో ప్రేక్షకుడు కూడా ట్విట్టర్‌లో సినిమా గురించి స్పందిస్తూ ఆసక్తికరమైన అంచనాను వెల్లడించారు. ‘ఇరుముడి’ కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్ సాధించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. టాలీవుడ్ చరిత్రలో అత్యంత లాభదాయకమైన చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మాస్ ఆడియన్స్ భారీగా థియేటర్లకు తరలివస్తారని, రవితేజకు ఈ చిత్రం అందించే కమ్‌బ్యాక్ తాను ఊహించిన దానికంటే మరింత గ్రాండ్‌గా ఉంటుందని అభిప్రాయపడ్డారు.అంతటితో ఆగకుండా.. ‘ఇరుముడి’ కనీసం రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని ఆ ప్రేక్షకుడు ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇవి ఆయన వ్యక్తిగత అంచనాలు, సోషల్ మీడియా స్పందనలో భాగంగానే చూడాల్సి ఉంటుంది.మరో నెటిజన్ రవితేజ నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో రవితేజను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రియాంక బోష్, సాయికుమార్ తమ తమ పాత్రల్లో మెప్పించారని తెలిపారు. ముఖ్యంగా కూతురు పాత్రలో నటించిన బేబీ నక్షత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. జీవీ ప్రకాశ్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కుదిరాయని, కొన్ని సందర్భాల్లో పీక్స్‌లో అనిపించాయని ప్రశంసించారు. అయితే రెండో ప్రధాన ప్లాట్‌లో వచ్చే ట్విస్టులను మరింత ప్రభావవంతంగా తెరకెక్కించి ఉంటే ఇంకా బాగుండేదని సూచించారు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. ‘ఇరుముడి’ ఒకసారి తప్పక చూడాల్సిన సినిమా అని తన రివ్యూలో పేర్కొన్నారు. మరో ప్రేక్షకుడు సినిమా చూసిన అనంతరం ట్విట్టర్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇప్పటివరకు సినిమా అద్భుతంగా ఉందని, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఆకట్టుకుందని తెలిపారు. రవితేజ అసాధారణమైన నటనతో మెప్పించారని, సాయికుమార్ కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారని ప్రశంసించారు.

దర్శకుడు శివ నిర్వాణ సినిమాను తెరకెక్కించిన విధానం బాగుందని, కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లారని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని ప్రశంసలు కురిపించారు. దీంతో సినిమా విడుదలైన వెంటనే రవితేజ నటన, సాయికుమార్ పెర్ఫార్మెన్స్, దర్శకుడి టేకింగ్, జీవీ ప్రకాశ్ బీజీఎంపై సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. మరో ప్రేక్షకుడు అయితే సినిమా ప్రారంభం నుంచే ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ అవుతుందని తాను ముందే చెప్పానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సినిమాకు యూనానిమస్ పాజిటివ్ టాక్ వినిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రవితేజకు ఇది అదిరిపోయే కమ్‌బ్యాక్ అని ప్రశంసించారు.  శివ నిర్వాణ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని, ఫస్ట్ హాఫ్ సూపర్‌గా ఉండగా.. సెకండాఫ్ మాత్రం బ్లాక్‌బస్టర్ రేంజ్‌లో ఉందని ఆ ప్రేక్షకుడు తెలిపారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయని పేర్కొన్నారు. అలాగే ‘మల్లెపూల పల్లకి’ పాట సెకండాఫ్‌లో మంచి హై మూమెంట్‌గా నిలిచిందని చెప్పారు. మొత్తంగా ‘ఇరుముడి’ తన అంచనాలను అందుకోవడమే కాకుండా.. రవితేజకు మాస్ కమ్‌బ్యాక్ అందించే సినిమా అంటూ ప్రశంసలు కురిపించారు.

Irumudi Movie Review ఇరుముడి’పై మిక్స్‌డ్ పాయింట్స్.. ఎమోషన్, నటన, క్లైమాక్స్‌కు మంచి మార్కులు

మరో ప్రేక్షకుడు సినిమా చూసిన తర్వాత ట్విట్టర్‌లో తన రివ్యూను పంచుకుంటూ ‘ఇరుముడి’ ఒక స్లో బర్న్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. కథలో కొన్ని రైటింగ్ లోపాలు ఉన్నప్పటికీ.. సినిమా హార్డ్ హిట్టింగ్‌గా, సిన్సియర్‌గా అనిపించిందని తెలిపారు. ఫస్ట్ హాఫ్ కొంత నెమ్మదిగా సాగుతుందని, అయితే కథ ఆసక్తిని పూర్తిగా కోల్పోకుండా తండ్రి-కూతురు బంధం చుట్టూ మంచి ఎమోషనల్ కనెక్షన్‌ను క్రియేట్ చేసిందని అభిప్రాయపడ్డారు. సెకండాఫ్ కొన్ని చోట్ల బాగా పనిచేసినప్పటికీ.. కొన్ని సన్నివేశాల్లో రైటింగ్ కాస్త కన్వీనియెంట్‌గా అనిపించిందని ఆ ప్రేక్షకుడు తెలిపారు. ముఖ్యంగా విలన్లను కేవలం షాక్ వాల్యూ కోసం అవసరానికి మించి క్రూరంగా చూపించినట్లు అనిపించిందని అభిప్రాయపడ్డారు. అయితే సినిమాలోని కొన్ని కీలక ట్విస్టులు మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయని, కథకు కేంద్రంగా ఉన్న ఎమోషనల్ కోర్ ఎక్కడా దెబ్బతినలేదని చెప్పారు.

ముఖ్యంగా క్లైమాక్స్ చాలా బాగా పేలిందని ప్రశంసించారు. నటన విషయానికి వస్తే.. ఇటీవలి కాలంలో రవితేజ ఇచ్చిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది ఒకటిగా అనిపించిందని తెలిపారు. కొంతకాలంగా వచ్చిన రవితేజ సినిమాలను పరిశీలిస్తే.. ‘ఇరుముడి’ మెరుగైన చిత్రాల్లో ఒకటని పేర్కొన్నారు. బేబీ నక్షత్ర కూడా అద్భుతంగా నటించిందని ప్రశంసించారు. కథలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, ఇలాంటి కథా విధానం గతంలో చూసినట్టుగా అనిపించినా.. సినిమా చూపించిన ఎమోషన్, సిన్సియారిటీ కారణంగా ‘ఇరుముడి’ని ఒకసారి తప్పకుండా ప్రయత్నించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ ప్రేక్షకుడు సినిమాకు 2.75/5 రేటింగ్ ఇచ్చారు. మరో ప్రేక్షకుడు ‘ఇరుముడి’పై స్పందిస్తూ రవితేజకు ఇది బలమైన కమ్‌బ్యాక్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యలను ప్రస్తావిస్తూ సినిమా మంచి సామాజిక సందేశాన్ని అందించిందని ప్రశంసించారు. సినిమాలో చిన్నారి నటన అద్భుతంగా ఉందని, సాయికుమార్ కూడా తన పాత్రలో మెప్పించారని తెలిపారు.

జీవీ ప్రకాశ్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా సపోర్ట్ చేశాయని, సినిమాలోని లొకేషన్స్ కూడా ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా, స్టెడీగా సాగుతుందని చెప్పారు. కథనం పూర్తిగా కొత్తగా అనిపించకపోయినా.. ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగించేలా ఉందని అభిప్రాయపడ్డారు.ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. ఎమోషన్స్‌తో పాటు టెన్షన్‌ను పెంచుతూ సినిమా ముందుకు సాగుతుందని, ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆ నెటిజన్ తెలిపారు. మొత్తంగా కొన్ని అంశాలు సాధారణంగా అనిపించినప్పటికీ.. మంచి ఎమోషనల్ కంటెంట్ కారణంగా ‘ఇరుముడి’ ఒకసారి చూడదగిన సినిమాగా అనిపించిందని తన రివ్యూలో పేర్కొన్నారు.

మొత్తం మీద సోషల్ మీడియాలో ఇప్పటివరకు వచ్చిన ఈ ప్రేక్షకుల స్పందనలను పరిశీలిస్తే.. రవితేజ నటన, సాయికుమార్ పెర్ఫార్మెన్స్, బేబీ నక్షత్ర నటన, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సెకండాఫ్ ట్విస్టులు, క్లైమాక్స్ వంటి అంశాలకు ఎక్కువగా ప్రశంసలు దక్కుతున్నాయి. అదే సమయంలో ఫస్ట్ హాఫ్ కొంత నెమ్మదిగా సాగడం, కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లే, రైటింగ్ మరింత టైట్‌గా ఉండాల్సిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.అయితే ఇవన్నీ సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన ప్రాథమిక అభిప్రాయాలు, వ్యక్తిగత రివ్యూలు మాత్రమే. సినిమా పూర్తి స్థాయి టాక్, ప్రేక్షకుల స్పందన, వసూళ్లపై స్పష్టమైన అంచనా రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ‘ఇరుముడి’పై రవితేజ అభిమానుల్లో ఆసక్తిని పెంచే విధంగా పాజిటివ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. Irumudi Movie Review ఇరుముడి మూవీ రివ్యూ, రవితేజ ఇరుముడి రివ్యూ, ఇరుముడి ట్విట్టర్ రివ్యూ, ఇరుముడి పబ్లిక్ టాక్, రవితేజ మూవీ రివ్యూ , ఇరుముడి సినిమా స‌మీక్ష , Irumudi Review, Irumudi movie review, Ravi Teja Irumudi, Irumudi Twitter Review, Irumudi Public Talk, Ravi Teja Movie Review

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp