Konda Susmitha : “నన్ను గెలికితే అన్నీ బయటపెడతా”.. రేవంత్‌రెడ్డిపై సుస్మిత సంచలన వ్యాఖ్యలు..!
Konda Susmitha : “నన్ను గెలికితే అన్నీ బయటపెడతా”.. కొండా సుస్మిత చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పరకాల ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి మరోసారి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. దీంతో పరకాల కాంగ్రెస్‌లో ఇప్పుడే అసలు రాజకీయ పోరు మొదలైందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో పరకాల అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఓ బహిరంగ సభలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం స్వయంగా ప్రస్తుత ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించడంతో పరకాల టికెట్ అంశంపై రాజకీయ చర్చ మొదలైంది. ఇదే సమయంలో కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆ చర్చకు మరింత వేడి పెంచాయి.సుస్మిత తన సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యల ద్వారా వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తానే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోయినా వెనక్కి తగ్గబోనని, అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుస్తానన్న ధీమాను వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు లేదా మరెవరైనా తనకు వ్యతిరేకంగా ప్రచారానికి వచ్చినా తన విజయాన్ని అడ్డుకోలేరని సుస్మిత వ్యాఖ్యానించారు.
Konda Susmitha : “నన్ను గెలికితే అన్నీ బయటపెడతా”.. రేవంత్‌రెడ్డిపై సుస్మిత సంచలన వ్యాఖ్యలు..!
Konda Susmitha “నన్ను గెలికితే అన్నీ బయటపెడతా”.. సుస్మిత ఘాటు వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొండా సుస్మిత తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత “కళ్లు నెత్తికి ఎక్కాయా?” అంటూ ప్రశ్నించారు. గతంలో రేవంత్ రెడ్డికి తమ తండ్రి చేసిన సహాయాన్ని గుర్తుచేస్తూ.. ఇప్పుడు తమ కుటుంబం ఆయనకు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో ఇప్పుడే రాజీనామా చేయించే దమ్ము ఉందా? అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.రేవంత్ రెడ్డి స్వయంగా పరకాలలో ప్రచారం చేసినా రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఓడిపోతారని సుస్మిత వ్యాఖ్యానించారు. తనను మరింతగా టార్గెట్ చేస్తే రేవంత్ కుటుంబానికి సంబంధించిన స్కాములన్నింటినీ బయటపెడతానని హెచ్చరించారు. ప్రస్తుతం తాను తన తమ్ముడికి సంబంధించినదిగా ఆరోపిస్తున్న రూ.200 కోట్ల భూ కుంభకోణం గురించి మాత్రమే మాట్లాడానని ఆమె పేర్కొన్నారు. తన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తే మరిన్ని విషయాలను బయటపెడతానని సుస్మిత అన్నారు.అదే సమయంలో 80 ఏళ్ల వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ సుస్మిత చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. దీంతో ఆమె వ్యాఖ్యలు పరకాల కాంగ్రెస్‌లో భవిష్యత్ టికెట్ పోరుపై ఆసక్తిని పెంచుతున్నాయి.
Konda Susmitha “పరకాల అప్‌కమింగ్ ఎమ్మెల్యే”.. సోషల్ మీడియా పోస్టుతో మరింత ఆసక్తి
మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా పరకాల నియోజకవర్గంలో వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కొండా సుస్మిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్టు కూడా రాజకీయంగా ఆసక్తిని రేపింది. “పరకాల అప్‌కమింగ్ ఎమ్మెల్యే” అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టడంతో వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ లక్ష్యాలపై మరింత స్పష్టత ఇచ్చినట్లయింది.ఇటీవల కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత కత్తితో కేక్ కట్ చేసిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే పరకాల నియోజకవర్గంలో కొండా కుటుంబం రాజకీయంగా మరింత యాక్టివ్ అవుతోందన్న చర్చ మొదలైంది.
రేవూరి ప్రకాశ్‌రెడ్డి కౌంటర్.. “సమయం వచ్చినప్పుడు సమాధానం”
కొండా సుస్మిత వ్యాఖ్యలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కూడా స్పందించారు. సమయం వచ్చినప్పుడు ఆమెకు సరైన సమాధానం ఇస్తానని, ప్రస్తుతం జరుగుతున్నది కేవలం ప్రారంభం మాత్రమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, అభ్యర్థుల ఎంపికకు పార్టీకి నిర్దిష్టమైన విధివిధానాలు ఉంటాయని ఆయన తెలిపారు.ముఖ్యమంత్రి నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలను ప్రోత్సహించడం, వారికి మద్దతు ఇవ్వడం సాధారణ విషయమేనని రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఆమె “ముందే కోయిల కూసినట్లు” మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో మంత్రి కొండా సురేఖతో తనకు ప్రస్తుతం ఎలాంటి విభేదాలు లేవని రేవూరి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మంత్రికి తానే ఫోన్ చేసి ఆహ్వానించానని తెలిపారు. ఆమె వస్తానని చెప్పినప్పటికీ సభలకు హాజరు కాలేదని రేవూరి వెల్లడించారు. దీంతో పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి దక్కుతుందన్న అంశం మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి మద్దతుగా మాట్లాడటం, మరోవైపు కొండా సుస్మిత తానే బరిలో ఉంటానని స్పష్టం చేయడం.. పరకాల కాంగ్రెస్‌లో భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఉత్కంఠను పెంచుతోంది. చివరకు ఈ టికెట్ అంశం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.
