Home » News » Karthika Deepam 2 April 9th 2026 Thursday Episode Highlights
News

Karthika Deepam 2 April 9th 2026 Episode | గుడిలో జ్యోత్స్న కన్నింగ్ ప్లాన్.. దీపతో పారిజాతం ఎంట్రీ అదిరిపోయే ట్విస్ట్!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: April 9, 2026, 8:32 am
Advertisement

Karthika Deepam 2 April 9th 2026 Episode | స్టార్ మా లో ప్రసారమవుతున్న ‘కార్తీక దీపం 2’ సీరియల్ రోజుకో కొత్త మలుపుతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కార్తీక్, దీపల జీవితాల్లో ఎదురవుతున్న సవాళ్లు, జ్యోత్స్న వేస్తున్న కుట్రలు, పారిజాతం మార్పు సీరియల్ పై ఆసక్తిని అమాంతం పెంచేస్తున్నాయి. ఏప్రిల్ 9వ తేదీన ప్రసారమైన 640వ ఎపిసోడ్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీప, కార్తీక్ ల పెళ్లి రోజును ఎలాగైనా చెడగొట్టాలని జ్యోత్స్న పన్నిన కన్నింగ్ ప్లాన్, దాన్ని తిప్పికొడుతూ పారిజాతం ఇచ్చిన సూపర్ ట్విస్ట్ ఈ ఎపిసోడ్ కే హైలైట్ గా నిలిచాయి. మరి ఈ రోజు ఎపిసోడ్ లో అసలు ఏం జరిగిందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Karthika Deepam 2 April 9th 2026 Episode | గుడిలో జ్యోత్స్న కన్నింగ్ ప్లాన్.. దీపతో పారిజాతం ఎంట్రీ అదిరిపోయే ట్విస్ట్!

Karthika Deepam 2 April 9th 2026 Episode జ్యోత్స్న కన్నింగ్ ప్లాన్.. గుడికి కార్తీక్ ప్రయాణం

కార్తీక్, దీపల పెళ్లి రోజు కావడంతో ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. కానీ, జ్యోత్స్న మాత్రం వాళ్ల ఆనందాన్ని చూసి రగిలిపోతుంటుంది. ఎలాగైనా సరే ఈ పెళ్లి రోజును చెడగొట్టాలని, కార్తీక్ పక్కన దీప కాకుండా తను ఉండాలని ఒక కన్నింగ్ స్కెచ్ వేస్తుంది. తన ప్లాన్ లో భాగంగా, కార్తీక్ తో కలిసి గుడికి వెళ్లాలని పట్టుబడుతుంది. అయితే, దశరథ కలుగజేసుకుని “ఈ రోజు వాళ్ల పెళ్లి రోజు కదా, గుడిలో దీపతో కలిసి అర్చన చేయించుకుంటాడు.. దీపను కూడా గుడికి తీసుకువెళ్లమని” కార్తీక్ కు సూచిస్తాడు. ఈ మాటలకు జ్యోత్స్న షాక్ అవుతుంది.

Advertisement

దీప కూడా వస్తే తన ప్లాన్ వర్కౌట్ కాదని గ్రహించిన జ్యోత్స్న.. “ముగ్గురం కలిసి వెళ్లకూడదు కదా” అని ఒక సాకు చెబుతుంది. అప్పుడు పారిజాతం (పారు) ఎంట్రీ ఇచ్చి, “అయితే నేను కూడా మీ వెంట వస్తాను” అని అంటుంది. అందరితో కలిసి గుడికి వెళ్లి పూజ చేయించుకుంటే తన పూజ ఫలించదని జ్యోత్స్న మరో డ్రామా మొదలుపెడుతుంది. సుమిత్ర ఎప్పటిలాగే జ్యోత్స్న వైపు నిలబడి, కేవలం జ్యోత్స్ననే గుడికి తీసుకువెళ్లమని కార్తీక్ కు చెబుతుంది. తల్లి మాట కాదనలేక కార్తీక్ జ్యోత్స్నతో కలిసి గుడికి బయలుదేరుతాడు. తన పథకం పారినందుకు జ్యోత్స్న మనసులో ఎంతో సంతోషిస్తుంది. కానీ, జ్యోత్స్న వ్యవహారం పట్ల పారిజాతానికి తీవ్రమైన అనుమానం వస్తుంది.

Karthika Deepam 2 April 9th 2026 Episode గుడిలో పూజారితో జ్యోత్స్న అబద్ధాలు

గుడికి చేరుకున్న తర్వాత కార్తీక్ గుడి లోపలికి రాకుండా బయటే కారు వద్ద ఉండిపోతాడు. అతన్ని లోపలికి రమ్మని జ్యోత్స్న ఎంత మారాం చేసినా కార్తీక్ వినడు. దాంతో, “నిన్ను ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు” అని మనసులో అనుకుంటూ జ్యోత్స్న ఒక్కత్తే గుడి లోపలికి వెళుతుంది. నేరుగా పూజారి దగ్గరకు వెళ్లి, “ఈ రోజు నా పెళ్లిరోజు పంతులు గారు.. అభిషేకం చేయించుకుందామని వచ్చాను. కానీ, మా ఆయన నా మీద అలిగి గుడి బయటే ఉండిపోయాడు. నేను మా ఆయనను లోపలికి రప్పిస్తాను, మీరు భార్యాభర్తలకు చేసినట్లుగా మా ఇద్దరికీ పూజ చేయండి” అని పచ్చి అబద్ధం చెబుతుంది.

Advertisement

వెంటనే కార్తీక్ కు ఫోన్ చేసిన జ్యోత్స్న, “నేను కారులో పూజా సామాగ్రి మరిచిపోయాను, కొద్దిగా తెచ్చి ఇవ్వు బావా” అని అడుగుతుంది. కార్తీక్ అందుకు నిరాకరించి, “నువ్వే వచ్చి తీసుకో” అని కరాఖండిగా చెబుతాడు. దానికి జ్యోత్స్న తన కన్నింగ్ బుద్ధిని ఉపయోగిస్తూ.. “ఒకసారి గుడిలోకి వచ్చిన తర్వాత పూజ పూర్తయ్యే వరకు బయటకు రాకూడదు, నువ్వు రాకపోతే నేను మా మమ్మీకి (సుమిత్రకు) ఫోన్ చేసి చెబుతాను” అని బ్లాక్ మెయిల్ చేస్తుంది. చేసేదేం లేక కార్తీక్ పూజా సామాగ్రి పట్టుకుని గుడి లోపలికి వెళతాడు.

కార్తీక్ కు షాక్ ఇచ్చిన పూజారి

కార్తీక్ గుడి లోపలికి అడుగుపెట్టగానే, పూజారి అతనిపై తీవ్ర స్థాయిలో మండిపడతాడు. “ఏమయ్యా, పెళ్లి రోజు నాడు కూడా భార్యను దూరం పెడతావా? నీ కోసం ఈమె ఎంత బాధపడుతుందో చూడు” అంటూ జ్యోత్స్నను చూపిస్తూ పంతులు క్లాస్ పీకుతాడు. ఈ మాటలు విన్న కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. “ఏంటి పూజారి గారు.. ఈవిడ మా ఆవిడ ఏంటి?” అని ఆశ్చర్యంగా అడుగుతాడు.

కార్తీక్ అలా అనగానే పూజారికి, అక్కడున్న మిగిలిన భక్తులకు విపరీతమైన కోపం వస్తుంది. నలుగురూ కలిసి కార్తీక్ ను నానా మాటలు అంటారు. “భార్య అనే వాహనానికి భర్త డ్రైవర్ లాంటి వాడు.. ఆడవాళ్ల మీద నోరు చేసుకోవడం తప్పు” అంటూ పూజారి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. పరిస్థితి చేయి దాటుతుండటంతో కార్తీక్ గట్టిగా మాట్లాడుతూ, “ఆవిడ నా భార్య కాదు పంతులు గారు.. ఆవిడ మెడలో తాళి ఉందా? కాలికి మెట్టెలు ఉన్నాయా? చూపించమనండి” అని నిలదీస్తాడు. ఈ దెబ్బతో జ్యోత్స్న బిత్తరపోతుంది.

దీపతో పారిజాతం ఎంట్రీ.. అదిరిపోయే ట్విస్ట్

కార్తీక్ మాటలకు పూజారి కూడా ఆలోచనలో పడతాడు. “మరి మీ అర్ధాంగి ఎవరు నాయనా?” అని పూజారి అడుగుతుండగానే.. “అది నేనే చెబుతాను పంతులు గారు” అంటూ పారిజాతం, దీపను వెంటబెట్టుకుని మాస్ ఎంట్రీ ఇస్తుంది. పారిజాతాన్ని, దీపను అక్కడ ఊహించని జ్యోత్స్న గుండెల్లో రాయి పడుతుంది.

Advertisement

పారిజాతం ముందుకు వచ్చి, దీపను చూపిస్తూ.. “ఈవిడ పేరు దీప.. ఈవిడే నా మనవడి సతీమణి” అని అందరి ముందు గర్వంగా చెబుతుంది. కార్తీక్ కూడా దీపనే తన భార్య అని, ఈ రోజే తమ పెళ్లి రోజు అని పూజారికి స్పష్టం చేస్తాడు. ఈ నిజం తెలియగానే అక్కడున్న వారంతా ఉలిక్కిపడతారు. ఎందుకు ఇలాంటి అబద్ధం ఆడావని పూజారి జ్యోత్స్నను నిలదీస్తాడు. జ్యోత్స్న కోసం మద్దతుగా వచ్చిన మహిళలు కూడా అక్కడినుంచి మెల్లగా జారుకుంటారు. ఆ తర్వాత పూజారి దీప, కార్తీక్ ల పేరు మీద అర్చన, అభిషేకం జరిపిస్తాడు. ఇద్దరూ కలిసి గుడిలో ప్రదక్షిణలు చేయడం, దీప నుదిటిపై కార్తీక్ ప్రేమగా బొట్టు పెట్టడం చూసి జ్యోత్స్న అసూయతో రగిలిపోతుంది.

ఇంట్లో శివన్నారాయణ కన్ఫ్యూజన్

మరోవైపు ఇంట్లో దీప, పారిజాతం కనిపించకపోవడంతో శివన్నారాయణ ఆరా తీస్తాడు. ఈ రోజు కార్తీక్-దీపల పెళ్లిరోజు కావడంతో వాళ్లను తీసుకుని పారిజాతం గుడికి వెళ్లిందని సుమిత్ర చెబుతుంది. దీనికి శివన్నారాయణ ఆశ్చర్యపోతూ, “జ్యోత్స్న తన వెంట ఎవరినీ రావొద్దని చెప్పింది కదా? పారిజాతం.. దీపను ఆ గుడికే తీసుకువెళితే అక్కడ పెద్ద గొడవ జరుగుతుందేమో” అని ఆందోళన చెందుతాడు.

అంతేకాకుండా పారిజాతంలో వచ్చిన ఈ ఆకస్మిక మార్పును చూసి ఆనందపడాలో, అనుమానపడాలో అర్థం కావడం లేదని అంటాడు. దానికి సుమిత్ర బదులిస్తూ.. “మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు కదా మావయ్య గారు. ఒకప్పుడు దీపను మనిషిలా కూడా చూడని అత్తయ్య గారు, ఇప్పుడు తన సొంత మనవరాలి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు” అని సంతోషంగా చెబుతుంది. దశరథకు కూడా శివన్నారాయణ సారీ చెబుతూ.. గతంలో వీలునామా మార్చినప్పుడు గొడవపడినందుకు బాధపడతాడు. జ్యోత్స్నలో వస్తున్న మార్పు (జ్యోత్స్న నటిస్తోందని తెలియక) చూసి కుటుంబం మొత్తం సంతోషిస్తూ ఉంటుంది.

పారిజాతం, జ్యోత్స్న మధ్య భీకరమైన వార్

గుడిలో ఒంటరిగా ఉన్న జ్యోత్స్నను పారిజాతం టార్గెట్ చేస్తుంది. “మెడలో తాళి బొట్టు లేదు, పాపిట్లో బొట్టు లేదు, కాలికి మెట్టెలు లేవు.. అయినా కార్తీక్ నీ మొగుడు అని చెబితే పూజారి గారు ఎలా నమ్మారు?” అని వెటకారంగా ప్రశ్నిస్తుంది. దానికి జ్యోత్స్న ఏమాత్రం తగ్గకుండా, “ఆడుకునే వయసులో బావను చూపించి వాడే నీ మొగుడు అని మీరే కదా చెప్పారు.. అప్పుడు ఏం చూసి బావ నా భర్త అని చెప్పారు?” అంటూ లాజిక్ తో ఎదురు దాడి చేస్తుంది.

Advertisement

“ఇప్పుడు పరిస్థితులు మారాయి జ్యోత్స్న. ఇప్పుడు కార్తీక్, దీప భర్త. వాళ్ల మధ్యలోకి వెళ్లొద్దు.. దీప కాపురంలో నిప్పులు పోయొద్దు” అని పారిజాతం గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. కానీ జ్యోత్స్న తన పంతం వీడకుండా యుద్ధానికి సై అంటుంది. కోపంతో ఊగిపోయిన పారిజాతం, “అసలు దీప ఎవరో తెలుసా?” అంటూ నిజం (దీప తన సొంత మనవరాలు అనే విషయం) చెప్పబోయి, దాస్ ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి ఆగిపోతుంది. “ఒక అడ్రస్ లేని దాని కోసం సొంత మనవరాలికి అన్యాయం చేస్తావా?” అని జ్యోత్స్న అడిగితే.. “ఓ మనవరాలి చేతిలో ఓడిపోయిన మనవరాలిగా నువ్వు మిగిలిపోతావు” అంటూ పారిజాతం సవాల్ విసురుతుంది.

చివరగా దీప కార్తీక్ వద్దకు వచ్చి.. “జ్యోత్స్నకు ఎంత ధైర్యం ఉంటే అందరి ముందు నిన్ను తన భర్త అని చెప్పుకుంటుంది? ఆమె అలా అంటుంటే నువ్వు సైలెంట్ గా ఎందుకు ఉన్నావు?” అని నిలదీయడంతో నేటి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగుస్తుంది. రాబోయే ఎపిసోడ్లలో దీప అసలు గుర్తింపు జ్యోత్స్నకు తెలుస్తుందా? కార్తీక్, దీపల బంధం ఎలా బలపడుతుంది అనేది ఆసక్తికరం.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి