Pension : వారి పెన్షన్లు మాత్రమే కోత ఏపీ సర్కార్ కీలక ప్రకటన ఫుల్ క్లారిటీ
AP Government’s key Announcement : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ మొత్తాన్ని పెంచి, ప్రతి నెలా ఒకటో తేదీ ఇంటి వద్దకే చెల్లించే విధానాన్ని అమలు చేస్తోంది. తాజాగా పెన్షన్ల అర్హుల జాబితాపై క్షేత్రస్థాయి నివేదికలు సేకరించిన ప్రభుత్వం, అందులో కొంతమంది దివ్యాంగ పెన్షన్లు అనర్హులకు వెళ్తున్నాయని గుర్తించింది. దీంతో పెన్షన్ల కొనసాగింపు, కోతపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
AP Government’s key Announcement
ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తూ, పెద్ద సంఖ్యలో దివ్యాంగ పెన్షన్లు తొలగించబడుతున్నాయని ఆరోపించాయి. అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దీనిపై స్పందిస్తూ, గత 15 నెలల్లో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని, ప్రస్తుతం 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగ పెన్షన్లు మంజూరైన సందర్భాలు ఉన్నాయని, వాటిని తొమ్మిది నెలలుగా పరిశీలిస్తున్నామని వివరించారు. భర్త చనిపోయిన వృద్ధ మహిళలకు కూడా పెన్షన్ మంజూరు చేస్తూ ప్రభుత్వం సహాయక విధానం అమలు చేస్తోందని తెలిపారు.
ఇప్పటివరకు 7 లక్షల 95 వేల పెన్షన్ల వెరిఫికేషన్ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. వీటిలో 20 వేల మందిని వృద్ధాప్య పెన్షన్లలోకి మార్చగా, 80 వేల మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సరైన సర్టిఫికెట్లు సమర్పించిన వారికి పెన్షన్ కొనసాగుతుందని, అనర్హులు అయితే రాకపోవచ్చని స్పష్టం చేశారు. అర్హులకు మాత్రమే ప్రయోజనం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలను ప్రదర్శించి, అనుమానం ఉన్నవారు తిరిగి పరిశీలన కోరుకునే అవకాశం కల్పించామని చెప్పారు. దీంతో పెన్షన్ పంపిణీలో పారదర్శకత సాధించడమే కాకుండా, దుర్వినియోగం నివారించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.