Jogi Ramesh Meghana : “డబ్బులు ఇస్తే ఫీలింగ్స్ వస్తాయి”.. జోగి రమేశ్ కోడలు మేఘన షాకింగ్ కామెంట్స్..!
Jogi Ramesh Meghana : వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంలో కొనసాగుతున్న వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. జోగి రమేశ్ కుమారుడు రాజీవ్, ఆయన భార్య మేఘన మధ్య తలెత్తిన విభేదాలు ఇప్పుడు పోలీస్ కేసు, పరస్పర ఆరోపణలు, ప్రెస్‌మీట్ల వరకు వెళ్లాయి. తన భర్తకు ఉన్న వ్యక్తిగత సమస్యను కుటుంబ సభ్యులందరూ ముందుగానే తెలుసుకున్నప్పటికీ తనకు ఆ విషయం చెప్పకుండా వివాహం చేశారని మేఘన ఆరోపిస్తున్నారు. అలాగే తమ కుటుంబ మత విశ్వాసాల విషయంలోనూ తనను మోసం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు.మేఘన చేసిన ఫిర్యాదు ఆధారంగా జోగి రమేశ్‌తో పాటు మొత్తం 10 మంది కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ ఇప్పటికే మీడియా సమావేశం నిర్వహించి తన వాదనను వినిపించారు. అయితే తాజాగా ఆయన కోడలు మేఘన కూడా ప్రెస్‌మీట్ పెట్టి తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పలు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, తన వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని, అవసరమైన సమయంలో వాటిని బయటపెడతానని చెప్పారు.
Jogi Ramesh Meghana : “డబ్బులు ఇస్తే ఫీలింగ్స్ వస్తాయి”.. జోగి రమేశ్ కోడలు మేఘన షాకింగ్ కామెంట్స్..!
మేఘన మాట్లాడుతూ.. “ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఒక ఆడపిల్లగా ఈ విషయాల గురించి బహిరంగంగా మాట్లాడాల్సి రావడం చాలా బాధగా ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడుతున్నానని, ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొంటున్నందుకు తనకు తానే గర్వంగా ఉందని చెప్పారు.తనపై జోగి రమేశ్, ఆయన కుటుంబ సభ్యులు నిందలు వేస్తున్నారని మేఘన ఆరోపించారు. గతేడాది మే నెలలో జోగి రమేశ్ కుమారుడు రాజీవ్‌తో తన వివాహం జరిగిందని చెప్పారు. తన తండ్రి సంతోషం కోసం ఎంతో కష్టపడి ఈ పెళ్లి చేశారని, జోగి రమేశ్‌పై నమ్మకంతోనే తనను వారి ఇంటికి కోడలిగా పంపించారని వివరించారు. అయితే పెళ్లైన కొద్ది రోజులకే తనకు ఇబ్బందులు మొదలయ్యాయని ఆమె ఆరోపించారు.
Jogi Ramesh Meghana రాజీవ్ సమస్య గురించి ముందే తెలుసా? మేఘన కీలక ఆరోపణలు
భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం, చివరకు విడిపోవడం సాధారణ విషయమే కావచ్చని మేఘన అన్నారు. కానీ తన భర్త రాజీవ్‌కు ఉన్న సమస్య గురించి కుటుంబ సభ్యులందరికీ ముందే తెలుసని ఆమె ఆరోపించారు. ఆ విషయం తెలిసినప్పటికీ తనకు రాజీవ్‌తో వివాహం చేయడం ద్వారా తన జీవితాన్ని నాశనం చేశారని అన్నారు. “అమ్మాయి గొంతు కోయడం లాంటి పని ఇది” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.జోగి రమేశ్‌కు కూడా ఒక కుమార్తె ఉందని గుర్తుచేసిన మేఘన.. ఇదే పరిస్థితి తన కూతురికి ఎదురైతే ఆయన ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. అసలు సమస్య ఉందని తెలిసినప్పటికీ తనతో పెళ్లి ఎందుకు చేశారో జోగి రమేశ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.తమ మధ్య గొడవలు రావడం వల్లే తాము విడిపోయామని జోగి రమేశ్ చెబుతున్నారని, అయితే ఆ గొడవలు ఎందుకు వచ్చాయో కూడా ఆయన ప్రజలకు వివరించాలని మేఘన అన్నారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకే జోగి రమేశ్ మీడియా ముందుకు వచ్చారని ఆరోపించారు. నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు సానుభూతి పొందడం, రాజకీయ ప్రయోజనం పొందడం కోసమే ఉన్నట్లు అనిపించిందని మేఘన వ్యాఖ్యానించారు. తనకు జరిగిన విషయాలన్నింటినీ ఇప్పటికే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరంగా పేర్కొన్నానని చెప్పారు.
ఇప్పుడే అన్ని విషయాలు బయటకు రాకపోయినా.. త్వరలోనే పూర్తి వాస్తవాలు అందరికీ తెలుస్తాయని మేఘన అన్నారు. వివాహం తర్వాత తనకు ఎదురైన సమస్యలను తొలుత తన మామ, అత్తలకే వివరించానని చెప్పారు. అయితే సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా అదనపు కట్నం తీసుకురావాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.తమకు రాజకీయ నేపథ్యం ఉందని, తాము చెప్పినట్లే చేయాలని బెదిరించారని మేఘన ఆరోపించారు. అదనపు కట్నం తీసుకొస్తే తాను సంతోషంగా ఉంటానని, అప్పుడు తన భర్తకు “ఫీలింగ్స్ వస్తాయి” అని తన అత్త చెప్పినట్లు ఆమె వెల్లడించారు. తల్లి స్థానంలో ఉండి తన పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన శకుంతల.. తననే తప్పుబట్టారని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు.
మత విశ్వాసాల విషయంలోనూ మోసం చేశారని ఆరోపణ
తమ వివాహానికి ముందు తాము హిందువులమని చెప్పి పెళ్లి జరిపించారని, కానీ అత్తవారి కుటుంబం మొత్తం క్రైస్తవ మతాన్ని అనుసరిస్తుందని మేఘన ఆరోపించారు. ఇంట్లో హిందూ పూజలు చేయడం లేదని ఆమె చెప్పారు. చిన్నప్పటి నుంచే తనకు హిందూ దేవుళ్లను పూజించే అలవాటు ఉందని, పెళ్లి తర్వాత కూడా అదే విధంగా పూజలు చేసేందుకు ప్రయత్నించానని వివరించారు.అత్తవారింటికి వెళ్లినప్పుడు ఒక్క హిందూ దేవుడి ఫొటో కూడా కనిపించలేదని మేఘన అన్నారు. తాను దేవుళ్ల ఫొటోలు తీసుకువచ్చి పూజ చేస్తుంటే అడ్డుకోవడమే కాకుండా తనపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. ఎవరి మత విశ్వాసాలు వారికి ఉండొచ్చని, కానీ తమ కుటుంబం క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న విషయాన్ని తనకు ముందుగానే చెప్పకపోవడం మాత్రం మోసమేనని ఆమె పేర్కొన్నారు.తనపై తప్పుడు ప్రచారం ఇప్పటికీ కొనసాగుతోందని మేఘన ఆరోపించారు. అసలు విషయాలను పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్నానని, ఎవరినో కలిస్తే వారి వెనుక ఎవరో ఉండి తనను నడిపిస్తున్నారని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అయితే తన వద్ద ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయని, వాటిని కూడా త్వరలో బయటపెడతానని హెచ్చరించారు.
తన అత్త శకుంతల వివాహం తర్వాత అనేక రకాలుగా తనను ఇబ్బందులకు గురిచేశారని మేఘన ఆరోపించారు. తన భర్తకు ఉన్న సమస్య గురించి మాట్లాడకుండా, ప్రతి విషయంలోనూ నిందలు తనపైనే మోపుతున్నారని అన్నారు. “మీ దేవుడిని నమ్ముకోవడం వల్లే నీకు ఇలా జరిగింది.. మా దేవుడిని నమ్ముకో, నీకు మంచి జరుగుతుంది” అని తనతో చెప్పేవారని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు.జోగి రమేశ్ తనను కూతురిలా చూసుకున్నానని చెబుతున్నారని, నిజంగా అలా చూసుకుని ఉంటే తాను ఈరోజు రోడ్డుపైకి వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేదని ఆమె ప్రశ్నించారు. జోగి రమేశ్ కుటుంబం వల్ల ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, అయినప్పటికీ వారు తమ తప్పును అంగీకరించకుండా తనపై కక్ష సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇదే సమయంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను తాను కలిసిన వీడియోను కూడా దొంగచాటుగా చిత్రీకరించారని మేఘన తెలిపారు. తాను రాజకీయ ప్రయోజనాల కోసం ఆయనను కలవలేదని, తనకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఆయన వద్దకు వెళ్లానని చెప్పారు. కుటుంబ వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా జోగి రమేశ్ సొంత బాబాయితో కూడా ఎమ్మెల్యే మాట్లాడారని, కుటుంబ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించినట్లు మేఘన వెల్లడించారు.ఈ వివాదంలో ఇరు వర్గాల వాదనలు వెలుగులోకి వస్తుండటంతో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మేఘన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరోపణలపై దర్యాప్తులో వెలువడే వివరాల ఆధారంగానే పూర్తి వాస్తవాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.
