YS Sharmila : వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేస్తా.. వైఎస్ షర్మిల..!
ప్రధానాంశాలు:
YS Sharmila : వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేస్తా.. వైఎస్ షర్మిల..!
YS Sharmila : మరో వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రధాన పార్టీలుగా వైయస్సార్ సీపీ, జనసేన , టీడీపీ ఉన్నాయి. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని వై.యస్.షర్మిల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వస్తున్న వార్తలకు తెరదించుతూ స్వయంగా షర్మిల ఈ విషయాన్ని వెల్లడించారు. ఇడుపులపాయలో తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను తన తండ్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి సమాధి ముందు ఉంచిన అనంతరం మీడియాతో మాట్లాడిన వై.యస్.షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో తన కుమారుడి పెళ్లి జరగబోతుందని, అందరి ఆశీర్వాదం కావాలని షర్మిల అన్నారు.
కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ క్రమంలోనే రేపు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవబోతున్నానని షర్మిల అన్నారు. ఢిల్లీలో రేపు జరగబోయే సమావేశం తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణలో వై.యస్.షర్మిల వైయస్సార్ టీపీ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తే కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని, అందుకే పోటీ నుంచి విరమించుకున్నానని చెప్పారు. తెలంగాణలో తమ పార్టీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేవి అని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో తమ పార్టీ కీలక పాత్ర పోషించిందని వై.యస్.షర్మిల అన్నారు.
తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉండడానికి తాము చేసిన సాయం కూడా ఒక కారణమని చెప్పుకొచ్చారు. అది గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం తనను పార్టీలో చేరాలని ఆహ్వానించిందని అన్నారు. దేశంలో అతిపెద్ద లౌకికవాద పార్టీ కాంగ్రెస్ అని, ప్రతి ఒక్కరికి భద్రతను ఇచ్చే పార్టీ అదే అని చెప్పారు. ఇక షర్మిల మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా కాబోయే దంపతులు వై.యస్.రాజారెడ్డి, ప్రియా అట్లూరి కూడా షర్మిల వెంట ఉన్నారు. ఏది ఏమైనా వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి రావడం పెను సంచలనంగా మారింది. ఇప్పటికే అధికార పార్టీ వైయస్సార్ సీపీ, కూటమిగా ఏర్పడిన జనసేన , టీడీపీ మధ్య గట్టి పోటీ ఏర్పడుతున్న క్రమంలో షర్మిల కాంగ్రెస్ లోకి చేరడం చర్చనీయాంశంగా మారింది. దీనివలన ఎవరికి లాభమో, ఎవరికి నష్టమో తెలియదు కానీ వై.యస్.షర్మిల ఎంట్రీ ఏపీ రాజకీయాలలో సెన్సేషనల్ గా మారింది.