GST 2.0 : బంగారం ధర దిగొస్తుందా..?
GST 2.0 Effect Gold Price Reduce : కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ వ్యవస్థలో తీసుకొచ్చిన తాజా సంస్కరణలు విప్లవాత్మకమని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఉన్న 5%, 12%, 18%, 28% స్లాబులను సులభతరం చేస్తూ 5% మరియు 18% అనే రెండు స్లాబులకే పరిమితం చేశారు. కొన్ని ప్రత్యేక ఉత్పత్తులకు 40% పన్ను రేటును అమలు చేయనున్నారు. ఈ కొత్త జీఎస్‌టీ రేట్లు 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. గృహ అవసరాల వస్తువులు ఎక్కువగా తక్కువ స్లాబ్‌లోకి వస్తుండటంతో వినియోగదారులకు ఉపశమనం లభించనుంది. అయితే బంగారం, వెండిపై మాత్రం ఎలాంటి మార్పులు లేవు.

GST 2.0 Effect Gold Price Reduce
బంగారం, వెండి ఆభరణాలపై ప్రస్తుత 3% జీఎస్‌టీ కొనసాగుతూనే ఉంది. అలాగే ఆభరణాల తయారీ ఛార్జీలపై 5% జీఎస్‌టీ అలాగే అమలులో ఉంటుంది. ఉదాహరణకు, గ్రాముకు రూ.10,650 ధరగా తీసుకుంటే, 10 గ్రాముల బంగారం విలువ రూ.1,06,500 అవుతుంది. తయారీ ఛార్జీలు 10% అంటే రూ.10,650. బంగారంపై 3% జీఎస్‌టీ రూ.3,195 కాగా, తయారీ ఛార్జీలపై 5% జీఎస్‌టీ రూ.532.5 అవుతుంది. మొత్తంగా చెల్లించాల్సిన జీఎస్‌టీ రూ.3,727.5. కాబట్టి మొత్తం ఖర్చు రూ.1,20,877.5 అవుతుంది. దీనివల్ల బంగారం కొనుగోలులో ఎలాంటి ప్రత్యక్ష ఉపశమనం లేదని చెప్పొచ్చు.
బంగారం, వెండి ధరల స్థిరత్వం పెట్టుబడిదారులకు స్పష్టతను ఇస్తున్నప్పటికీ, జువెలర్లకు మాత్రం పెద్దగా ప్రయోజనం కలిగించడం లేదు. రేటు తగ్గింపు ఆశించిన జువెలర్లు కొంత నిరాశకు గురయ్యారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, యు.ఎస్. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపుపై అంచనాలు, బలహీనమవుతున్న డాలర్ ఇలా అన్ని కలిసి బంగారానికి మద్దతు ఇస్తున్నాయి. నిపుణుల ప్రకారం.. బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయిల సమీపంలో ఉండగా, రాబోయే గ్లోబల్ డేటా, ముఖ్యంగా అమెరికా నాన్-ఫామ్ పేరోల్స్ నివేదిక, స్వల్పకాలిక ధరల దిశను నిర్ణయించనుంది.