Lucky Draw Promotion : ఆఖరికి దేవుడ్ని కూడా వదలని ఇన్‌ఫ్లూయెన్సర్లు..వ్యూస్ కోసం ఇంతకు తెగబడతారా ?
ప్రస్తుత కాలంలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ఆరాటంతో చాలా మంది యువత ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడమే కాకుండా, అడ్డదారులు తొక్కి ఇతరులను మోసగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్ క్యాస, సిద్ధమోని నరేందర్ అనే ఇద్దరు యువకులు తమకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న లక్షకు పైగా ఫాలోవర్లను ఆసరాగా చేసుకుని భారీ మోసానికి తెరలేపారు. ‘లక్కీ డ్రా’ పేరుతో ప్రజలను ఆకర్షించి, వారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. కేవలం రూ. 399 చెల్లిస్తే చాలు.. ఖరీదైన హ్యుందాయ్ ఐ20 కారు, ఐఫోన్లు, బైకులు మరియు టీవీలు వంటి బహుమతులు గెలుచుకోవచ్చని నమ్మబలికారు. సామాన్య ప్రజలు ఈ తక్కువ మొత్తానికి ఆశపడి వారి ఖాతాలకు నగదు పంపిస్తూ మోసపోతున్నారు.
ఆఖరికి దేవుడ్ని కూడా వదలని ఇన్‌ఫ్లూయెన్సర్లు..వ్యూస్ కోసం ఇంతకు తెగబడతారా ?
ప్రజల్లో నమ్మకం కలిగించడానికి ఈ నిందితులు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆలయ ప్రాంగణాన్ని తమ మోసపూరిత ప్రచారానికి వేదికగా మార్చుకున్నారు. భక్తుల్లా వేషధారణ ధరించి, ఆలయం ముందే ప్రమోషన్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దైవ సన్నిధిలో చెబుతున్నారు కాబట్టి ఇది నిజమేనని భక్తులు నమ్మేలా వీరు పక్కా స్కెచ్ వేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఆలయ గౌరవానికి భంగం కలిగేలా వీరు చేసిన ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ అక్రమ వసూళ్ల ద్వారా లక్షల రూపాయలు దోచుకోవడమే వీరి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
ఈ మోసపూరిత వీడియోను గమనించిన శ్రీ ఆదిభట్ల శ్రీ కళాపీఠం వ్యవస్థాపకురాలు పడాల కల్యాణి, తక్షణమే స్పందించి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తిని ఆసరాగా చేసుకుని ఇలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడటం నేరమని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పోలీసులు ప్రవీణ్, నరేందర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ఆకర్షణీయమైన ‘లక్కీ డ్రా’ ప్రకటనలను నమ్మవద్దని, గుర్తు తెలియని వ్యక్తుల ఖాతాలకు డబ్బులు పంపవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వ్యూవర్ షిప్ కోసం, ఈజీ మనీ కోసం పవిత్ర క్షేత్రాలను వాడుకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.