మళ్ళీ అదే ఫార్మూలా.. ఆ దర్శకుడు గట్టెక్కేనా?
YVS Chowdary : వైవీఎస్ చౌదరి సినిమాలంటే తెలుగు వారందరికీ ఓ అంచనాలుంటాయి. ‘సీతారామరాజు’, ‘యువరాజు’, ‘సీతయ్య’, ‘దేవదాస్’, లాహిరి లాహిరి లాహిరిలో వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. తెలుగుదనం, ప్రేమలు ఆప్యాయతలు ఇలా వాటి చుట్టూనే తిరుగుతుంటాయి. అయితే రేయ్ సినిమా దారుణంగా బెడిసి కొట్టడంతో దర్శకుడిగా చాలా గ్యాప్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఓ కథను రెడీ చేశానని వైవీఎస్ చౌదరి చెప్పుకొచ్చారు.
ఆదివారం(మే 23) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ తన సినీ విశేషాల గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నేనొక అందమైన ప్రేమకథ సిద్ధం చేశా. తెలుగు వారి సంస్కృతి – సంప్రదాయాలు ఉట్టిపడేలా.. తెలుగు వాళ్ల వాడి-వేడి ప్రతిబింబించేలా.. స్క్రిప్ట్ రాసుకున్నా. దీంట్లో మధురమైన సంగీతంతో పాటు తేనెలూరే సాహిత్యమూ మిళితమై ఉంటుంది. వీలైనంత తక్కువ సమయంలో ప్రేక్షకులకు ఆసక్తిరేకెత్తించేలా ఈ సినిమాని ముస్తాబు చేయాలని ప్రణాళిక రచిస్తున్నా అని అన్నారు.
దాదాపు కొత్తవాళ్లతోనే ఈ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. కథానాయికగా ఓ పదహారణాల తెలుగమ్మాయిని తీసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చారు. నిజానికి గతేడాదే దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలి అనుకున్నాడట. కరోనా – లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల ఆలస్యమైందని అన్నారు. మళ్లీ ఇప్పుడు సెకండ్ వేవ్ దెబ్బ కొట్టడంతో మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. పరిస్థితులు చక్కబడ్డాక సినిమాను ప్రారంభిస్తానని అన్నారు. అయితే మళ్లీ అదే ఫార్మూలాను నమ్ముకున్న వైవీఎస్ చౌదరికి హిట్ వస్తుందా? లేదా? అన్నది చూడాలి.