AI Jobs : లక్ష జీతం ఇస్తామన్న దొరకని AI ఉద్యోగులు ..నేర్చుకుంటే లక్షాధికారి కావొచ్చు !!
AI : భారతదేశంలో కృత్రిమ మేధ (ఏఐ) మార్కెట్ అత్యంత వేగవంతమైన వృద్ధి దశలో ఉంది. టీమ్‌లీజ్ డిజిటల్ తాజా నివేదిక ప్రకారం, 2025 నాటికి ఏఐ మార్కెట్ 45 శాతం సంచిత వార్షిక వృద్ధి రేటుతో 28.8 బిలియన్ అమెరికన్ డాలర్లకు (రూ.2.50 లక్షల కోట్లు) చేరనుంది. ఏఐతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లోనూ ఉద్యోగావకాశాలు విస్తరిస్తుండగా, ప్రత్యేక నైపుణ్యాల కొరత తీవ్ర సమస్యగా మారుతోంది. ముఖ్యంగా జెనరేటివ్ ఏఐ రంగంలో ప్రతి 10 ఉద్యోగ ఖాళీలకు ఒక అర్హత కలిగిన నిపుణుడు మాత్రమే అందుబాటులో ఉండటం సవాలుగా మారింది.
ఏఐ రంగంలో ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఎల్‌ఎల్‌ఎమ్ సేఫ్టీ, ఏఐ ఆర్కెస్ట్రేషన్, ఏజెంట్ డిజైన్, కాంప్లియెన్స్ మరియు రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి నైపుణ్యాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నైపుణ్యాలు భవిష్యత్ ఉద్యోగ విపణిలో కీలక పాత్ర పోషించనున్నాయి. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (జీసీసీలు)లో జెనరేటివ్ ఏఐ ఇంజినీరింగ్, మెషీన్ లెర్నింగ్ ఆపరేషన్స్ విభాగాల్లో ఉద్యోగులు సంవత్సరానికి రూ.58-60 లక్షల వరకు వేతనం పొందుతున్నారు. డేటా ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో కూడా వేతనాలు భారీగా పెరుగుతున్నాయి.
జీసీసీలు కొత్త ఉద్యోగ సృష్టిలో ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. 2027 నాటికి భారత్‌లో జీసీసీల సంఖ్య 2,100కు చేరుతుందని, వీటిలో సుమారు 30 లక్షల మంది నిపుణులు పనిచేయనున్నారు. ఈ సెంటర్లు మెట్రో నగరాలతో పాటు రెండో, మూడో అంచె పట్టణాల్లోనూ ప్రతిభావంతుల నియామకానికి దోహదపడుతున్నాయి. మహిళా ప్రాతినిధ్యం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో పెరుగుతున్న అవకాశాలతో భారత్ గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మరింత బలపడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.