Home » Andhra Pradesh » Pm Modi Launches Hpv Vaccine
andhra pradesh

HPV vaccine : హెచ్‌పీవీ టీకాను ప్రారంభించిన ప్రధాని మోడీ .. హెచ్‌పివి టీకా అంటే ఏమిటి .. అది ఏవ‌రికి ప్ర‌యోజ‌నం ..?

Authored By
Suma
The Telugu News | Published on: February 28, 2026, 3:00 pm
Advertisement

HPV vaccine : బాలికల్లో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. (ఫిబ్రవరి 28) శనివారం నుంచి దేశవ్యాప్తంగా 14–15 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) టీకాను అందించనుంది. ఈ మహత్తర కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని అజ్మీర్ నగరంలో ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ టీకా పంపిణీ జరుగుతుంది. ప్రతి ఏడాది సుమారు 1.15 కోట్ల మంది బాలికలకు టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో దశలవారీగా సుమారు 6.75 లక్షల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, తెలంగాణలో హైదరాబాద్‌లో మంత్రి దామోదర రాజనర్సింహా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.

Advertisement

HPV vaccine : హెచ్‌పీవీ టీకాను ప్రారంభించిన ప్రధాని మోడి .. హెచ్‌పివి టీకా అంటే ఏమిటి .. అది ఏవ‌రికి ప్ర‌యోజ‌నం ..?

HPV vaccine : గార్డాసిల్-4 టీకా ప్రత్యేకతలు, ప్రయోజనాలు

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రభుత్వ కేంద్రాల్లో గార్డాసిల్-4 టీకాను ఉచితంగా అందించనున్నారు. ఈ టీకా నాలుగు రకాల హెచ్పీవీ వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. గర్భాశయ క్యాన్సర్‌ను దాదాపు 98 శాతం వరకు నివారించే సామర్థ్యం ఈ వ్యాక్సిన్‌కు ఉందని నిపుణులు చెబుతున్నారు. 9 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు ఈ టీకా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ వయస్సులో శరీర రోగనిరోధక శక్తి బలంగా స్పందించడంతో తక్కువ మోతాదుతోనే మెరుగైన రక్షణ లభిస్తుంది. 14 సంవత్సరాల వయస్సులో ఒకే డోసు సరిపోతుందని భావిస్తున్నప్పటికీ, 15 సంవత్సరాలు పైబడిన బాలికలకు రెండు డోసులు అవసరం కావచ్చు. 26 సంవత్సరాల లోపు మహిళలకు ఈ టీకా ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది. 2006లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఈ వ్యాక్సిన్ ఇప్పటివరకు 50 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయింది. 160 దేశాల్లో హెచ్‌పీవీ టీకా కార్యక్రమం అమలులో ఉంది. వాటిలో 90 దేశాలు సింగిల్ డోస్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఈ జాబితాలో చేరింది.

Advertisement

HPV vaccine : పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు .. నివారణే మార్గం

భారత్‌లో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ రెండో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా నమోదవుతోంది. ప్రతి సంవత్సరం సుమారు 80,000 కొత్త కేసులు, 42,000కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బాధితుల సంఖ్యలో చైనా, అమెరికా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. 2040 నాటికి దేశంలో ఏటా 20 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశముందని అంచనాలు సూచిస్తున్నాయి. హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్, బలహీన రోగనిరోధక శక్తి, హెచ్ఐవీ, ధూమపానం, వ్యక్తిగత పరిశుభ్రత లోపం, చిన్న వయస్సులో గర్భధారణ వంటి అంశాలు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. 30 ఏళ్లు దాటిన మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సంభోగం తర్వాత అసాధారణ రక్తస్రావం, పీరియడ్స్ మధ్య రక్తస్రావం, దుర్వాసనతో కూడిన యోని ఉత్సర్గ, రుతువిరతి తర్వాత రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రారంభ దశలో శస్త్రచికిత్సతో చికిత్స సాధ్యమవుతుండగా ఆలస్యమైతే కీమోథెరపీ అవసరం కావచ్చు. అందుకే బాలికలు తగిన వయస్సులో హెచ్‌పీవీ టీకా తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అవగాహన పెంపొందించడం ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను సమర్థంగా అడ్డుకోవచ్చు. ఈ జాతీయ కార్యక్రమం మహిళల ఆరోగ్య రక్షణలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

 

Advertisement

 

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి