ఈ ఒక్క పనితో జగన్ ఏపీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు?
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ ఒక్క పనిని సమర్థంగా నిర్వహించారంటే ఆయన చరిత్రలో మిగిలిపోతారు. ఏపీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఏపీ ప్రజలు ఎన్నటికీ జగన్ ను మరిచిపోరు. అదే భూముల సమగ్ర రీసర్వే. అవును.. ముఖ్యమంత్రి జగన్ ను, ఆయన పాలనను ఏపీ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలంటే.. ఏపీ వ్యాప్తంగా ఒక్క ఎకరాన్ని కూడా వదలకుండా.. భూముల రీసర్వే చేయించడమే. దాని వల్ల ఎన్నో సమస్యలు తగ్గుతాయి.
భూసమస్యల వల్ల ఎటువంటి అనర్థాలు చోటు చేసుకుంటాయో అందరికీ తెలిసిందే. భూసమస్యలనేవి ఇప్పుడు వచ్చినవి కావు.. దశాబ్దాల నుంచి రైతులను వెంటాడుతున్న సమస్యలు ఇవి. వీటికి చెక్ పెట్టాలంటే.. ఏపీలోని ప్రతి అంగుళాన్ని మళ్లీ సర్వే చేయించడమే. అప్పుడే భూసమస్యలకు చెక్ పెట్టొచ్చు.
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం
అందుకే.. సీఎం జగన్ తన పుట్టిన రోజు అంటే డిసెంబర్ 21న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకానికి శ్రీకారం చుట్టారు. అసలు.. ఏపీ చరిత్రలోనే కాదు.. దేశంలోనే అతి పెద్ద భూరీసర్వే ఇది. దాన్ని జగన్ సర్కారు ప్రారంభించడం నిజంగా ప్రశంసనీయం.
మొత్తం మూడు దశల్లో భూరీసర్వేను ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. మొదటి దశలో 5122 గ్రామాల్లో భూసర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండో దశలో 6000 గ్రామాల్లో నిర్వహిస్తారు. అనంతరం మూడో దశలో భాగంగా.. మిగిలిన గ్రామాల్లో సర్వే ఉంటుంది. మూడు దశల్లో భూరీసర్వే పూర్తవడానికి కనీసం 2023 అగస్టు వరకు సమయం పడుతుందని అంచాన వేశారు.
అటవీ ప్రాంతం మినహా.. మిగితా భూమి మొత్తం రీసర్వే
అయితే.. అటవీ ప్రాంతాన్ని మాత్రం ఈ భూరీసర్వే ప్రాజెక్టులో పరిగణనలోకి తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని వదిలేసి… కేవలం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూములను, ఇళ్లను అత్యాధునిక సర్వే పరికరాలతో కొలవనున్నారు. సర్వేతో పాటే వెంటనే హద్దు రాళ్లను కూడా ప్రభుత్వమే వేయిస్తుంది. దీంతో.. శాశ్వతంగా భూసమస్యలకు ఇక చెక్ పడినట్టే.
ఈ ప్రాజెక్టు సక్సెస్ ఫుల్ గా పూర్తయితే.. సీఎం జగన్ ఎక్కడికో వెళ్లిపోతారు. ఏపీ చరిత్రలోనే ఎవ్వరూ చేయని సాహసం చేసిన సీఎం జగన్ కు ఏపీ రైతులు బ్రహ్మరథం పడతారు.