TG Assembly Session : మూడు కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Assembly Unanimously Passed 3 Bills : తెలంగాణ శాసనసభలో మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు, అలాగే అలోపతిక్ ప్రైవేట్ వైద్య సంరక్షణ సంస్థల చట్టాన్ని రద్దు చేసే బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ.. ఆర్థిక అసమానతలు తొలగాలంటే ఉపాధి అవకాశాలు పెరగాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Assembly Unanimously Passed 3 Bills
2018లో కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ విధించిందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సీలింగ్ లేవని, తెలంగాణలో ఉన్న ఆ పరిమితిని తొలగించేందుకే సవరణ బిల్లు తీసుకొచ్చామని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా బీసీలకు మరింత న్యాయం జరుగుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలలో అపోహలు కలిగించేలా తప్పుడు సమాచారం ఇవ్వొద్దని ఆయన హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై పూర్తి వివరాలు సేకరించేందుకు బీసీ కమిషన్‌కు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో అనుమానాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. “సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు చిత్తశుద్ధి చూపినట్లే, మా ప్రభుత్వం కూడా బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధితో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.