బిగ్ బ్రేకింగ్‌ : తెలంగాణ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఆదేశాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

బిగ్ బ్రేకింగ్‌ : తెలంగాణ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఆదేశాలు

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 May 2021,9:48 pm

Etela Rajender : అనుకున్నట్టుగానే ఈటల రాజేందర్ పై రోజురోజుకూ రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆయన మంత్రిత్వ శాఖను సీఎం కేసీఆర్ కు అటాచ్ చేశారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నా ఏ శాఖ ఆయన వద్ద లేదు. ఇక చివరి అస్త్రాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రయోగించారు. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు. ఈటలను బర్తరఫ్ చేయాలంటూ సీఎం కేసీఆర్… తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజదన్ కు సిఫారసు చేయగా… గవర్నర్ వెంటనే ఈటలను బర్తరఫ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో గవర్నర్ పేర్కొన్నారు.

etela rajender dismissed from telangana cabinet

etela rajender dismissed from telangana cabinet

మొన్నటి నుంచి… మెదక్ జిల్లా రైతులు సీఎం కేసీఆర్ కు లేఖ రాయడం మొదలు… ఇప్పటి వరకు ఈటల రాజేందర్ మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక దాని వెంట మరోటి.. ఆయన కనీసం గుక్క తిప్పుకోకుండా.. పక్కా ప్రణాళికతో ఈటలపై అభియోగాలు మోపి… ఆయన మంత్రి పదవిని తొలగించారు. మెదక్ జిల్లా అచ్చంపేటలో సుమారు 100 ఎకరాల అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశారంటూ రైతులు సీఎం కేసీఆర్ కు లేఖ రాయడంతో… వెంటనే సీఎం కేసీఆర్ ఈటలపై విచారణకు ఆదేశించారు.

అదే రోజు రాత్రి… ఈటల ప్రెస్ మీట్ పెట్టి.. తను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తాను తప్పిచేసినట్టు రుజువైతే.. ముక్కు నేలకు రాస్తానన్నారు. ఇదంతా కట్టుకథ అని.. కావాలని తనపై బురద జల్లుతున్నారని తెలిపారు. తాను డబ్బులు పెట్టి కొనుక్కున్న లాండ్ అని… అక్కడ ఎటువంటి కబ్జా చేయలేదని ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ లో చెప్పినా… తెల్లారే… ఆయన వద్ద ఉన్న వైద్యారోగ్య మంత్రిత్వ శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేశారు. వెంటనే అధికారులు కూడా అక్కడికి వెళ్లి భూసర్వే చేశారు. ఏసీబీ, విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అక్కడ కబ్జాకు గరైన భూముల్లో అసైన్డ్ భూములు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Etela Rajender : నివేదిక ప్రభుత్వం చేతుల్లో పడగానే… ఈటల బర్తరఫ్

మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్.. దగ్గరుండి.. ఈటలకు సంబంధించిన భూకబ్జా వ్యవహారంపై విచారణ ప్రారంభించి.. దానికి సంబంధించిన దర్యాప్తు నివేదికను రూపొందించి.. దాన్ని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు అందించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు నివేదికను పరిశీలించింది. వెంటనే సీఎం కేసీఆర్.. ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ రాష్ట్ర గవర్నర్ కు సిఫారసు చేయడంతో… గవర్నర్ కూడా వెంటనే ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనే ఉన్నా… ఆ శాఖ సమన్వయ బాధ్యతలను సీఎం కేసీఆర్ … సీఎంవోలో కార్యదర్శిగా ఉన్న రాజశేఖర్ రెడ్డికి అప్పగించారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది