BC Reservation : మంత్రి సీతక్క మొత్తం అబద్దమే చెపుతూ..కేసీఆర్ ని బద్నామ్ చేస్తుంది – కేటీఆర్
పంచాయతీరాజ్ చట్టంలో బీసీ రిజర్వేషన్లపై సీలింగ్ విధించారన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తిప్పికొట్టారు. శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఇది 100 శాతం అబద్ధం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా సీలింగ్ అన్న పదం వాడలేదు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శాస్త్రీయంగా చట్టాలు చేస్తే న్యాయవ్యవస్థ అడ్డు రాదు” అని స్పష్టం చేశారు.
ఆర్టికల్ 243డీ6, టీ6 ప్రకారం రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించుకోవచ్చని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం 396 జీవో ద్వారా 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయం వివరించారు. అయితే ఆ జీవో ఇచ్చిన వెంటనే మహబూబ్‌నగర్‌కు చెందిన గోపాల్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారని, ఆయన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి బంధువని చెప్పారు. దీంతో రిజర్వేషన్ల ప్రక్రియ నిలిచిపోయిందని, అసలు సమస్య కాంగ్రెస్ పార్టీ నిర్వాకం వల్లే వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు.
అలాగే 15 రోజులు సభ నడపకుండా ప్రభుత్వం పారిపోతుందని, అసలు విషయాలపై చర్చకు రాకుండా తప్పించుకుంటుందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ డబ్బులు బీహార్‌లో ప్రకటనలకు ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. న్యాయసమీక్షలో నిలబడలేని జీవోలతో బీసీలకు ఉపయోగం లేదని, పార్లమెంట్‌లో చేయాల్సిన చట్టాలను ఇక్కడ చేయడం వలన ప్రయోజనం ఉండదని ప్రశ్నించారు. “ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టని గవర్నర్, ఈ బిల్లుపై సంతకం ఎలా పెడతారు? ప్రజలను మోసం చేయడానికి ఇదంతా చేస్తున్నారు” అని కేటీఆర్ నిలదీశారు.