Malla Reddy Key Comments on CBN : చంద్రబాబు పై మల్లన్న ప్రశంసలు..సైకిల్ ఎక్కేందుకేనా..?
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. వ్యాపారవేత్తగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, విద్యాసంస్థల వ్యవస్థాపకుడిగా ఎదగడం, ఆపై రాజకీయాల్లో అడుగుపెట్టి మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగడం విశేషమే. “పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడినా” అంటూ ప్రజల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న మల్లారెడ్డి ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్నారు. అయితే, ఆయన భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ఏ దిశగా వెళ్తుందనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.

#image_title
బీఆర్ఎస్‌లో కొనసాగుతారా లేక టీడీపీ వైపు వెళ్తారా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇటీవల ఆయన తిరుమల పర్యటనకు వెళ్లిన సందర్భంలో టీడీపీ నేతలు ఘన స్వాగతం పలకడం, పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తిరుపతి, కాళహస్తి ఎమ్మెల్యేల ఫోటోలు ఆ ఫ్లెక్సీల్లో ఉండటం టీడీపీ వైపు మొగ్గుతున్న సంకేతాలుగా భావిస్తున్నారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత మల్లారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును ప్రశంసించడం, తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితులపై వ్యాఖ్యలు చేయడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి.
గతంలో 2014లో మల్కాజిగిరి నుంచి టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి, ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరి 2018లో మేడ్చల్ నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన మళ్లీ సొంత గూటి టీడీపీ వైపు చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే బాధ్యతలు మల్లారెడ్డికి అప్పగించే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, మల్లారెడ్డి అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు కొనసాగించడం, ఇటీవల పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులతో భేటీలు జరపడం ఆయన రాజకీయ భవిష్యత్ మరింత ఆసక్తికరంగా మారేలా చేస్తోంది.