కేసీఆర్.. నీకు దమ్ముంటే ముందు నీ కొడుకును మంత్రి పదవి నుంచి తీసేయ్.. రేవంత్ రెడ్డి సవాల్?
ప్రస్తుతం తెలంగాణలో దేవరయాంజల్ భూముల కబ్జా గురించే చర్చ. దేవరయాంజల్ భూమలను ప్రభుత్వానికి చెందిన నేతలే కబ్జా చేశారని.. ప్రతిపక్ష నేత, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన దేవరయాంజల్ భూముల వద్దకు వెళ్లి వాటిని ఆయన పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. దేవరయాంజల్ భూముల్లో 212 సర్వే నెంబర్ నుంచి 218 సర్వే నెంబర్ వరకు… మొత్తం 84 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. అవి దేవుడి మాన్యాలు అని.. కానీ.. ఆ భూములను తెగ నమ్ముతున్నారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 84 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా అమ్ముకుంటుందోని.. సీఎం కేసీఆర్ కు చెందిన పత్రిక కార్యాలయాన్ని అనుమతులు లేకుండా నిర్మించారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
దేవుడి మాన్యాలను వెంచర్ వేసి మరీ తెగనమ్ముతున్నారు. గండ్ర శ్రీనివాసరావు ఎవరు? కేసీఆర్ కు బంధువు. ఆయన అక్కడ వెంచర్ వేసి.. భూములను ఎంతో డేర్ గా అమ్మేస్తున్నారు. అలాగే… 657 సర్వే నెంబర్ లో మంత్రి మల్లారెడ్డి బావమరిది ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. ఈ భూములన్నీ హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. అంటే మున్సిపల్ శాఖ కిందికి వస్తాయి. అంటే మున్సిపల్ మంత్రి కేటీఆర్ దీనికి బాధ్యులు. కేటీఆర్ సన్నిహితులు శ్రీధర్, ఇంకో వ్యక్తి.. అందరూ కలిసి భూములను పంచుకుంటున్నారు. కేసీఆర్.. నీకు దమ్ముంటే ముందు నీ కొడుకు మంత్రి పదవి తీసేయ్.. అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
దేవరయాంజల్ భూముల్లో టీఆర్ఎస్ నేతల గోదాంలు, ఫామ్ హౌస్ లు
దేవరయాంజల్ భూములను రేవంత్ రెడ్డి నేతృత్వంలో కమిటీ పర్యటించగా… అక్కడ భూముల్లో గోదాంలు, ఫామ్ హౌస్ లు ఉండటాన్ని రేవంత్ రెడ్డి బృందం గమనించింది. ఈ భూములను పలువురు నేతలు కబ్జాలు చేశారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ గోదాములు, ఫామ్ హౌస్ లు… టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలవేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చివరకు ఐఏఎస్ అధికారులు కూడా మంత్రి కేటీఆర్ చెప్పినట్టు చేస్తున్నారు. జన్వాడలో కూడా అలాగే ఆక్రమించుకొని యువరాజు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు.. అంటూ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.
మల్లారెడ్డి.. ఇక్కడే ఉంటా.. రా…
మంత్రి మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డి బీభత్సంగా ఫైర్ అయ్యారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి 657 సర్వే నెంబర్ లో భూములు ఉన్నాయి. 212 నుంచి 218 సర్వే నెంబర్ తో పాటు, 657, 658 సర్వే నెంబర్ కూడా దేవుడి మాన్యాలే. కానీ.. 657 లో వీళ్ల భూములు ఉన్నాయి. మంత్రి మల్లారెడ్డి.. ముందు ఇక్కడికి రా… ఇక్కడే ఉంటా… అరగంట సేపు ఉంటాను. ఇక్కడే ఉంటా..రా.. తేల్చుకుందాం.. అంటూ రేవంత్ రెడ్డి మల్లారెడ్డికి సవాల్ విసిరారు.