Telangana : అలర్ట్ : తెలంగాణలో రేపటినుంచి కఠిన ఆంక్షలు.. వాటిపై నేడు నిర్ణయం…?
Telangana : దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో మహమ్మారి ఉద్దృతి కొనసాగుతోంది. ఇక తెలంగాణలో ఇటీవలి కాలంలో రోజుకు పదివేల కంటే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించే విషయం. కోవిడ్ -19 డెల్టా వేరియంట్‌తో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా తన ప్రతాపం చూపిస్తోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది.ఇప్పటికే విద్యా సంస్థల సెలవుల్ని పొడిగించిన ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలకు సన్నద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం ప్రగతి భవన్ వేదికగా జరుగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ ఈ మేరకు దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం.
కరోనా కేసుల కట్టడి దృష్ట్యా.. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 గంటల అనంతరం కర్ఫ్యూ విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దాంతో పాటు.. సినిమా హాళ్లు, మాల్స్ ఇతర జన సందోహం ఉన్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక విద్యా సంస్థలకు సెలవులను పొడిగించిన ప్రభుత్వం.. వారికి ఆన్ లైన్ క్లాసులను పెట్టే దిశగా చూస్తోందట. ఈ మేరకు నేటి మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారట. కొవిడ్ ఆంక్షలతో అమలు చేయడంతో పాటు… కరోనా వ్యాధి నిర్దారణ పరీక్షలను ముమ్మరం చేయడం, టీకాల పంపకంలో వేగం పెంచడం, ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచడం వంటి వాటి పైన మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుందట.
Telangana : రాత్రి 9 తర్వాత లాక్ డౌన్..
ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే రేపటినుంచి నైట్ కర్ఫ్యూను అమల్లోకి తీసుకు రానున్నారు. కరోనా కేసులు అధికంగా ఉన్న… మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. అయితే ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని… పూర్తి స్థాయి లాక్ డౌన్ కాకుండా, పాక్షిక లాక్ డౌన్ ను అమలు పరుస్తున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ఇక్కడ కూడా పాక్షిక లాక్ డౌన్ ను అమలులోకి తీసుకురానున్నారట. తెలంగాణ అసెంబ్లీ సభాపతి పోచారంతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మహమ్మారి బారిన పడ్డారు.