Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ తీరుతో అయోమయంలో టీడీపీ.!
Pawan Kalyan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటున్నారని కాదుగానీ, తెలుగుదేశం పార్టీ తన దత్త పుత్రుడిగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి అనుకుంటోంది. ‘మేం ఎలా చెబితే పవన్ అలా వింటాడు..’ అనే భావన టీడీపీలో ఎప్పటినుంచో బలంగా వుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ – జనసేన విడివిడిగా పోటీ చేసినా, ‘పవన్ కళ్యాణ్ మావాడే..’ అని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు చెప్పుకున్నారు. ఆ సంగతి పక్కన పెడితే, టీడీపీ తనను వాడుకుని లాభపడుతోందన్న భావనకు పవన్ కళ్యాణ్ వచ్చినట్లున్నారు.
అదే సమయంలో బీజేపీకి కూడా తన వల్ల మేలు జరుగుతోందిగానీ, తనకు ఆ పార్టీ వల్ల వచ్చిన లాభమేమీ లేదని పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్, ఒంటరి పోరు దిశగా అడుగులేస్తున్నారు. అందుకే, గతంలో ఎన్నడూ లేనంత సీరియస్‌గా రాజకీయాలు చేసేస్తున్నారిప్పుడు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి కావాల్సింది కూడా ఇదే. ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో కొంత వుంటుంది గనుక, అది విపక్షాల్లో అనైక్యత కారణంగా చీలిపోతే, బంపర్ మెజార్టీ ఇంకోసారి తమ సొంతమవుతుందన్నది వైసీపీ భావన.
ఇదే, తెలుగుదేశం పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే, చెరిసగం.. లేదంటే, టీడీపీ కంటే ఎక్కువ సీట్లను జనసేన కోరుతున్న పరిస్థితి వుందిప్పుడు. ఆ స్థాయిలో టీడీపీ బలహీనపడిపోయింది. కానీ, మేకపోతు గాంభీర్యమైతే టీడీపీ ప్రదర్శిస్తోంది.
టీడీపీని వదిలేస్తే, పవన్ కళ్యాణ్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాజకీయంగా నిలదొక్కుకునే అవకాశం వుందని వైసీపీ నేతలే చెబుతున్న సంగతి తెలిసిందే. మరి, ఈ దిశగా పవన్ అడుగులు సాగుతాయా.? వేచి చూడాల్సిందే.