Tik Tok : టిక్ టాక్ మళ్లీ ఇండియాకి రాబోతోంది..? డేటా ఇక్కడే స్టోర్ చేసేలా ఓ సంస్థతో చర్చలు
Tik Tok : ప్రముఖ షార్ట్ వీడియో మెసేజింగ్ యాప్ టిక్‌టాక్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. చైనా తర్వాత అత్యధిక యూజర్లు ఉన్నది ఇండియాలోనే. లాంచ్ అయిన కొద్దిరోజుల్లోనే ప్రపంచ దేశాలకు అతి వేగంగా పాకేసింది. ఇండియాలో ఎంతో మంది టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయ్యారు. డ్యాన్స్, కామెడీ ఇతర వీడియోలు చేస్తూ అప్ లోడ్ చేసి కాసుల పంట పండించుకున్నారు. ఎంతో మంది సెలబ్రెటీలు అయిపోయారు. ఈ యాప్ ద్వారా బోల్డ్ కంటెంట్ కూడా ఎక్కువైందనే చెప్పాలి. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు చాలా మంది టిక్ టాక్ లో మునిగిపోయేవారు. సోషల్ మీడియాల్లో నంబర్ వన్ గా కొనసాగింది.ఇక ప్రపంచ వ్యాప్తంగా 2020లో అత్యధికంగా ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకున్నారు.
కొన్ని కోట్ల మందికి ఈ టిక్ టాక్ ఓ వ్యసనంలా మారింది. అయితే 2020లో కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత దృష్ట్యా ఈ యాప్ ని బ్యాన్ చేసింది. చైనా యాప్ కావడంతో దేశ సమాచారాన్ని చైనాకి చేరవేస్తున్నారనే అనుమానంతో ఈ చర్యలకు పూనుకుంది. దీంతో బైట్ డ్యాన్స్ కి చెందిన టిక్ టాక్ యాప్ ఇండియాలో పూర్తిగా నిషేదించబడింది. ఇలా ప్రపంచంలో చాలా దేశాలు ఈ యాప్ ని బ్యాన్ చేశాయి. అయితే టిక్‌టాక్‌ను మళ్లీ భారత్‌లోకి తీసుకురావాలని ఆ సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. భారత్‌కు చెందిన హిరనందని గ్రూప్ తో భాగస్వామ్యం ఏర్పరుచుకొని ఇండియాలో టిక్‌టాక్‌ను మళ్లీ లాంచ్ చేయాలని బైట్‌డ్యాన్స్ ఆలోచిస్తోందని ఎకనమిక్స్ టైమ్స్ రిపోర్ట్ వెల్లడించింది.
ఈ కంపెనీ భాగస్వామ్యంతో భారత్‌లోనే డేటా స్టోర్ అయ్యేలా చర్యలు తీసుకొని టిక్‌టాక్‌ను రీలాంచ్ చేయాలని బైట్‌డ్యాన్స్ ప్లాన్ చేస్తోంది. అయితే డేటా స్టోరేజ్ ని ఇండియాలోనే భద్రపరిచేలా మార్పులు చేసుకుంటే అనుమతి ఇచ్చే అవకాశం ఉదని చర్చ నడుస్తోంది. అయితే హిరనందని అనే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సంస్థతో ఒప్పందం చేసుకుని డేటా ఇక్కడే స్టోర్ చేయాలని బైట్ డ్యాన్స్ ప్రయత్నిస్తోంది. అయితే ప్రభుత్వం అనుమతి లభిస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే.