Heatwave : వామ్మో.. మార్చిలోనే ఏమి ఎండలురా బాబు..!
ప్రధానాంశాలు:
Heatwave : వామ్మో.. మార్చిలోనే ఏమి ఎండలురా బాబు..!
Heatwave : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దహించివేస్తున్నాయి. సాధారణంగా మే నెలలో కనిపించే భయంకరమైన ఎండలు ఈసారి మార్చిలోనే ప్రజలను కాలిపోయేలా చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండగా, వడగాల్పులు విపరీతంగా వీచి జనాలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 42 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవ్వగా, మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేస్తూ, ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తోంది. వేడి గాలుల ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువగా నీరు తాగాలని, అనవసరంగా ఎండలో తిరగవద్దని సూచనలు ఇస్తోంది.

Heatwave : వామ్మో.. మార్చిలోనే ఏమి ఎండలురా బాబు..!
Heatwave తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు
ఏపీలో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భీకర స్థాయికి చేరాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 42 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పుల ప్రభావం 100కి పైగా మండలాల్లో కనిపిస్తోంది. దీంతో ప్రజలు ఎండవేడిమి నుంచి రక్షణ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఉదయం 11 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండటంతో రోడ్లపై జన సంచారం తగ్గిపోయింది. ఇటు తెలంగాణలోనూ అదే స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, మహబూబ్‌నగర్, మెదక్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పుల ప్రభావంతో ఒంటిపై నీరసం, డీహైడ్రేషన్ సమస్యలు పెరుగుతుండటంతో వైద్యులు, ఆరోగ్య నిపుణులు ప్రజలకు పలు సూచనలు అందిస్తున్నారు.