Revanth Reddy : రేవంత్ రెడ్డి పదవి పై ABN రాధాకృష్ణ సీరియస్ కామెంట్స్..!
Revanth Reddy : ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈమధ్య సినిమాలు బాగానే చూస్తున్నట్లున్నారు! ఆయన వారాంతపు ‘కొత్త పలుకు’ సంపాదకీయంలో ఈసారి వాడిన శైలి చూస్తే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. సాధారణంగా సూటిగా, సుత్తి లేకుండా అసలు విషయానికి వచ్చేసే ఆర్కే.. ఈ వారం మాత్రం ఓ ఆసక్తికరమైన సినిమా డైలాగ్‌తో భలే తెలివిగా ఉపోద్ఘాతాన్ని మొదలుపెట్టారు. సినిమాల్లో చిన్న పిల్లల చేత భారీ డైలాగులు చెప్పిస్తుంటారని, అవి కొన్నిసార్లు వినడానికి బాగున్నా.. మరికొన్ని సందర్భాల్లో మాత్రం మరీ అతిగా అనిపిస్తుంటాయని రాధాకృష్ణ రాసుకొచ్చారు. ఈ ఉదాహరణ ద్వారా కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓ ‘ముదురు పిల్లాడు’ అని పరోక్షంగా చురకలంటించారు.
Revanth Reddy : రేవంత్ రెడ్డి పదవి పై ABN రాధాకృష్ణ సీరియస్ కామెంట్స్..!
Revanth Reddy రాజగోపాల్ రెడ్డిపై ఆర్కే ప్రశ్నల వర్షం.. ఘాటు విమర్శలు
రాధాకృష్ణ తన తాజా సంపాదకీయంలో ఏ విషయాన్నీ దాచుకోకుండా కుండబద్దలు కొట్టారు. ‘మిత్రమా’ అంటూనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెమటలు పట్టేలా సాలిడ్ కౌంటర్ ఇచ్చారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. కర్నూలు జిల్లా ఎన్నికల ప్రచారంలో “తెలంగాణకు వెళ్లాలంటే వీసా కావాలి” అని వ్యాఖ్యానించినప్పుడు, తెలంగాణ ఉద్యమకారుడిని అని చెప్పుకునే నువ్వు ఎందుకు నోరు మెదపలేదు? నాడు వైఎస్‌ను ఎందుకు ప్రతిఘటించలేదు? అంటూ సూటిగా ప్రశ్నించారు. సీనియర్ నేత జానారెడ్డిని పక్కన పెట్టినప్పుడు, దివంగత జైపాల్ రెడ్డి లాంటి గొప్ప నాయకుడిని కేవలం ఢిల్లీ రాజకీయాలకే పరిమితం చేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావని నిలదీశారు. “మమ్మల్ని ఆంధ్ర మీడియా అని విమర్శిస్తున్నావు కదా.. మరి నువ్వు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఎందుకు వ్యాపారాలు చేస్తున్నావ్? అక్కడ టెండర్లు ఎందుకు వేస్తున్నావ్?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
వైఎస్సార్ పిలుపుతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాజగోపాల్ రెడ్డికి ఆర్కే పలు ఉదాహరణలతో నోరు పెకలనివ్వకుండా చేశారు. “నీకు చేతనైతే వంద కాకపోతే వెయ్యి టీవీ ఛానెల్స్ పెట్టుకో.. వెయ్యి పత్రికలు పెట్టుకో.. నిన్ను కాదన్నది ఎవరు? అంత గొప్ప స్థాయి ఉన్నవాడివి, కనీసం ఒక మంత్రి పదవిని ఎందుకు దక్కించుకోలేకపోయావు?” అంటూ బహిరంగంగానే సవాల్ విసిరారు. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. రాజగోపాల్ రెడ్డి విషయంలో రాధాకృష్ణ తన కలం విశ్వరూపాన్ని చూపించారు. చాలా రోజుల తర్వాత కారం, మసాలా దట్టించిన వాక్యాలతో రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించారు.
సీఎం రేవంత్ రెడ్డికి హెచ్చరిక.. కాంగ్రెస్‌లో కుట్రలపై సంచలనం
రాజగోపాల్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తర్వాత, ఆర్కే నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాపిక్‌లోకి వచ్చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొన్ని స్వరాలు ఏకం కావడాన్ని.. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా జరుగుతున్న ఓ పెద్ద కుట్రగా రాధాకృష్ణ అభివర్ణించారు. ఆశ్చర్యకరంగా, రేవంత్‌ను వ్యతిరేకిస్తున్న ఆ వ్యక్తులకు గులాబీ పార్టీ (బీఆర్ఎస్) అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం, ఆ పార్టీకి అనుకూలమైన మీడియాలో వారికి సముచిత స్థానం కల్పించడం పట్ల ఆర్కే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఓ బలమైన నాయకుడిని వెతికి పట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగా అన్వేషణ జరుపుతుంటే.. అధికార కాంగ్రెస్ పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం మాత్రం సీఎం రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గించడానికి కుట్రలు పన్నుతోందని రాష్ట్రంలోని అసలు రాజకీయ ముఖచిత్రాన్ని రాధాకృష్ణ బట్టబయలు చేశారు.
సీఎంను బలహీనపరచడానికి తెరవెనుక పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని వివరిస్తూనే.. దీనికి రేవంత్ రెడ్డి స్వయంకృతాపరాధం కూడా కొంత ఉందంటూ అసలు నిజాన్ని బయటపెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ నేతలకు సరైన సమయం ఇవ్వకపోవడం, తోటి మంత్రులతో స్వేచ్ఛగా మాట్లాడకపోవడం, ఎమ్మెల్యేల కష్టసుఖాలను పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ వ్యతిరేక పరిస్థితి దాపురించిందని ఆర్కే కుండబద్దలు కొట్టారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన ఒంటెద్దు పోకడలు, ధోరణి మార్చుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి.. ఇలా అందరినీ ఏకకాలంలో ఓ ఆట ఆడుకుంటూ, రాజకీయ పాఠకులకు అసలు సిసలైన ‘మాస్ మసాలా’ వంటకాన్ని ఈ వారం ‘కొత్త పలుకు’లో రాధాకృష్ణ వడ్డించారు.
