Kavitha : కేసీఆర్ బాటలో వెళ్తునంటున్న కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కవి కాళోజీని స్మరించుకుంటూ ఆయన కవిత్వం, విలువలు ఇప్పటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని కవిత అన్నారు. అలాగే, మహిళా శక్తికి ప్రతీక అయిన చాకలి ఐలమ్మ వీరత్వాన్ని తెలంగాణ గుండెల్లో ముద్రించుకున్నామని పేర్కొన్నారు. “ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన ఐలమ్మ స్ఫూర్తితో మనం ముందుకు సాగాలి” అని ఆమె పిలుపునిచ్చారు.

#image_title
కవిత మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ప్రశ్నించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తేవడానికి కేవలం రూ.1500 కోట్లు సరిపోతాయని, కానీ మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తేవడమేంటని రూ.7500 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యయ భారం వెనుక అవినీతి ఉందని, మేఘా సంస్థలకు లాభం చేకూర్చడమే అసలు ఉద్దేశమని ఆరోపించారు. “ప్రజల సొమ్మును వృథా చేయడానికి రేవంత్‌కు హక్కు లేదు. ప్రాజెక్ట్ ఖర్చు ఎందుకు పెరిగిందో స్పష్టతనివ్వాలి” అని కవిత డిమాండ్ చేశారు.
అలాగే, తెలంగాణ జాగృతి సామాజిక తెలంగాణ సాధన కోసం కృషి చేస్తుందని కవిత తెలిపారు. అన్ని వర్గాలను కలుపుకొని సమాజాన్ని బలపరచడం లక్ష్యమని, మూడోసారి కేసీఆర్ గెలిస్తే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు. “కేసీఆర్ ఎంచుకున్న మార్గమే మాది. అందరికీ అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణమే మా లక్ష్యం” అని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్లడమే తమ ధ్యేయమని కవిత తన ప్రసంగంలో పునరుద్ఘాటించారు.