Home » News » Over 41 Lakh Fake Ration Cards Cancelled Nationwide Telangana Loses 1 40 Lakh
News

Ration Cards : తెలంగాణలో 1.40 లక్షల రేషన్ కార్డుల రద్దు: దేశవ్యాప్తంగా 41.41 లక్షల కార్డులకు ఎసరు.. కేంద్ర మంత్రి ప్రకటన!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: April 1, 2026 10:58 pm
Advertisement

Ration Cards  : ప్రజా పంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేసి, అర్హులైన పేదలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా ఉన్న రేషన్ కార్డుల ఏరివేత చేపట్టింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఏకంగా 41.41 లక్షల అనర్హుల రేషన్ కార్డులను రద్దు చేసినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బాంభానియా పార్లమెంట్‌లో అధికారికంగా ప్రకటించారు. ఈ తొలగింపు జాబితాలో తెలంగాణ నుండి ఏకంగా 1,40,947 కార్డులు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 102 కార్డులు మాత్రమే రద్దు కావడం గమనార్హం.

Advertisement

Ration Cards : తెలంగాణలో 1.40 లక్షల రేషన్ కార్డుల రద్దు: దేశవ్యాప్తంగా 41.41 లక్షల కార్డులకు ఎసరు.. కేంద్ర మంత్రి ప్రకటన!

Ration Cards  టెక్నాలజీతో అక్రమాలకు చెక్.. ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి

రేషన్ సరుకుల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను, లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 5.51 లక్షల రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ e-PoS పరికరాలను అమర్చినట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారుల ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా మాత్రమే ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతోందని, దీంతో బోగస్ కార్డులు, పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం అక్రమాలకు పూర్తి స్థాయిలో చెక్ పడిందని ఆమె వివరించారు.

Advertisement

అలాగే, ప్రస్తుతానికి ప్రజా పంపిణీ వ్యవస్థ PDS డేటాబేస్‌ను ఇతర కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లింక్ చేసే ప్రతిపాదన ఏదీ తమ ముందు లేదని మంత్రి పార్లమెంట్‌లో స్పష్టం చేశారు.

వివిధ శాఖల డేటా ఆధారంగానే ఏరివేత.. ఎక్కడ ఎన్ని రద్దయ్యాయి?

ఏదో ఆషామాషీగా కాకుండా పక్కా ప్లానింగ్‌తో కేంద్రం ఈ బోగస్ కార్డుల ఏరివేత చేపట్టింది. ఆదాయపు పన్ను శాఖ Income Tax, రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ, మరియు జీఎస్టీ GST డేటాను సమగ్రంగా విశ్లేషించి, నిబంధనలకు విరుద్ధంగా రేషన్ పొందుతున్న వారిని గుర్తించారు. ఈ గణాంకాల ఆధారంగానే 41.41 లక్షల అక్రమ కార్డులకు కత్తెర వేశారు.

Advertisement

రద్దయిన కార్డుల రాష్ట్రాల వారీ జాబితా (ప్రధాన రాష్ట్రాలు)

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం అత్యధికంగా హర్యానాలో 13.43 లక్షల కార్డులు రద్దు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.

హర్యానా: 13,43,474

రాజస్థాన్: 6,05,826

ఉత్తరప్రదేశ్: 5,97,102

Advertisement

మధ్యప్రదేశ్: 2,60,285

బీహార్: 1,49,043

తెలంగాణ: 1,40,947

మహారాష్ట్ర: 1,33,469

Advertisement

ఒడిశా: 1,21,134

కర్ణాటక: 50,594

తమిళనాడు: 33,339

కేరళ: 7,261

గోవా: 3,467

ఆంధ్రప్రదేశ్: 102 (అతి తక్కువ)

తెలంగాణలో పెరిగిన కొత్త రేషన్ కార్డులు.. హైదరాబాద్‌లోనే టాప్

ఒకవైపు కేంద్రం బోగస్ కార్డులను తొలగిస్తుండగా, మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య పెరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో పోలిస్తే, ప్రస్తుత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా 15 లక్షలకు పైగా రేషన్ కార్డులు మంజూరైనట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17,348 రేషన్ దుకాణాలు ఉండగా, వాటి ద్వారా ప్రతినెలా 1.05 కోట్ల కార్డులకు రేషన్ పంపిణీ జరుగుతోంది.
వీటిలో కార్డుల వివరాలు ఇలా ఉన్నాయి:

ఆహార భద్రతా కార్డులు (Food Security Cards): 99,36,073

అంత్యోదయ అన్న యోజన (AAY): 5,66,660

అన్నపూర్ణ కార్డులు: 5,146

జిల్లాల వారీగా కార్డుల గణాంకాలు

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అత్యధిక రేషన్ కార్డులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి.

హైదరాబాద్ జిల్లా: 936 రేషన్ దుకాణాలు ఉండగా, అత్యధికంగా 8.39 లక్షల కార్డులు ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా: 588 దుకాణాల పరిధిలో 6.53 లక్షల కార్డులు ఉన్నాయి.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: 655 రేషన్ దుకాణాల పరిధిలో 6.41 లక్షల కార్డులు ఉన్నాయి.

ఇక రాష్ట్రంలో అత్యల్ప రేషన్ కార్డులు ఉన్న జిల్లాలుగా ములుగు (1.02 లక్షలు), నారాయణపేట (1.69 లక్షలు) నిలిచాయని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. కేంద్రం చేపట్టిన ఈ ప్రక్షాళనతో భవిష్యత్తులో మరింత పారదర్శకంగా ప్రజా పంపిణీ వ్యవస్థ నడుస్తుందని భావిస్తున్నారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి