Anchor Rashmi Gautam : ఇలాంటి ప్రపంచంలో నేను బతకలేను.. జబర్దస్త్ రష్మి భావోద్వేగం..!
Anchor Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై దాదాపు దశాబ్ద కాలానికి పైగా అప్రతిహతంగా కొనసాగుతూ కోట్లాది మంది ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది…
Anchor Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై దాదాపు దశాబ్ద కాలానికి పైగా అప్రతిహతంగా కొనసాగుతూ కోట్లాది మంది ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది ‘జబర్దస్త్’ కామెడీ షో. ఎంతో మంది కమెడియన్లు, జడ్జీలు, తోటి యాంకర్లు, తెరవెనుక పనిచేసే క్రియేటివ్ టీమ్ సభ్యులు ఈ వేదికను వీడి వెళ్లినా.. రష్మి గౌతమ్ మాత్రం మొదటి నుంచీ ఈ షోకు ప్రధాన ఆకర్షణగా కొనసాగుతూ తనకంటూ తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు. కేవలం గ్లామరస్ యాంకర్‌గానే కాకుండా, సమాజంలో జరిగే అన్యాయాలపై గళమెత్తడంలో, మూగజీవాల సంరక్షణ కోసం నిస్వార్థంగా పోరాడటంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. తాజాగా హైదరాబాద్ నగర శివార్లలో చోటుచేసుకున్న ఓ హృదయ విదారక ఘటనపై రష్మి స్పందించిన తీరు, ఆమె చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది.
Anchor Rashmi Gautam : ఇలాంటి ప్రపంచంలో నేను బతకలేను.. జబర్దస్త్ రష్మి భావోద్వేగం..!
Anchor Rashmi Gautam కౌకూరు గేటెడ్ కమ్యూనిటీలో దారుణం: వాచ్‌మెన్ ఘాతుకానికి ఐదేళ్ల చిన్నారి బలి
హైదరాబాద్‌లోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మిల్టన్ ఫెర్నాండెజ్, డేజీ ఇవాంజెలియా దంపతులకు మోజెస్ అరేలియా (5) అనే కుమార్తెతో పాటు జేడెన్ ఫెర్నాండెజ్ అనే కుమారుడు ఉన్నారు. ఈ కుటుంబం కౌకూరులోని ‘విల్లా ఆర్కిట్’ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తోంది. అదే విల్లాలో బీహార్‌కు చెందిన విక్రమ్ అనే యువకుడు వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తించేవాడు. అయితే, సరైన పనితీరు లేకపోవడంతో పాటు ఇతర కారణాల వల్ల కొద్దిరోజుల క్రితమే విల్లా నిర్వాహకులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. పనిలో నుంచి తీసివేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన విక్రమ్.. గేటెడ్ కమ్యూనిటీ నిర్వాహకులతో పాటు పాప కుటుంబంతోనూ తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ పగను మనసులో పెట్టుకున్న విక్రమ్.. శనివారం సాయంత్రం విల్లా పరిసరాల్లో అమాయకంగా ఆడుకుంటున్న ఐదేళ్ల మోజెస్ అరేలియాను కిడ్నాప్ చేశాడు. చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి నిందితుడు విక్రమ్ పాప తల్లిదండ్రులకు ఫోన్ చేసి, చిన్నారిని సురక్షితంగా విడిచిపెట్టాలంటే ₹20 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. రంగంలోకి దిగిన పోలీసులు కమ్యూనిటీలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించగా.. సెల్లార్ నుంచి నిందితుడు ఒక్కడే బయటకు వెళ్లడం కనిపించింది. పాప బయటకు వెళ్లిన ఆనవాళ్లు లేకపోవడంతో విల్లా ప్రాంగణాన్ని జల్లెడ పట్టారు. చివరకు సెల్లార్‌లోని నీటి సంపులో అరేలియా మృతదేహం కాళ్లు, చేతులు కట్టేసి, బరువైన రాయి వేలాడదీసిన స్థితిలో కనిపించడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబానికి అప్పగించారు. నిందితుడు విక్రమ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
Also Read : Janasena : విజయవాడ మేయర్ పీఠంపై జనసేన కన్ను.. వంగవీటి పుష్పాంజలి పేరుతో బిగ్ ట్విస్ట్..?
Anchor Rashmi Gautam ఇలాంటి ప్రపంచంలో బతకలేను.. కన్నీటిపర్యంతమైన యాంకర్ రష్మి గౌతమ్
ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. నిందితుడికి ఉరిశిక్ష విధించాలంటూ సోషల్ మీడియాలో నిరసన వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలోనే యాంకర్ రష్మి గౌతమ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “కేవలం డబ్బు కోసం ఒక గేటెడ్ కమ్యూనిటీ నుంచి ఐదేళ్ల పసిపాపను అపహరించి ఇంత కిరాతకంగా చంపేస్తారా? ఈ ఘటన గురించి ఆలోచిస్తూ గతరాత్రంతా నాకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. అసలు మనం సమాజంగా ఎటువైపు వెళ్తున్నాం? మనుషుల ఆలోచనలకు ఏమైంది? కనీసం చిన్నపిల్లలకు, అమాయక మూగజీవులకు రక్షణ కల్పించలేని సమాజం అసలు మనకు అవసరమా? బలహీనులను కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత మనపై లేదా? ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘోరాలు వింటూ బతకాల్సి వస్తోంది. ఈ దారుణాలు చూశాక సోషల్ మీడియా ఓపెన్ చేయడానికి కూడా మనస్కరించడం లేదు” అంటూ రష్మి తన ఆవేదనను అక్షరాల్లో వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తూ నెటిజన్లు నిందితుడికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.







