School Holidays : తెలంగాణలో విద్యాసంస్థలకు భారీ సెలవులు.. ఆగస్టు హాలిడే లిస్ట్ ఇదే..!
School Holidays : ఆగస్టు నెలలో తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు పలుమార్లు సెలవులు రానున్నాయి. బోనాలు, స్వాతంత్ర్య దినోత్సవం, ఈద్-మిలాద్-ఉన్-నబీ, రక్షా బంధన్ సందర్భంగా సెలవుల పూర్తి జాబితా తెలుసుకోండి.
విద్యార్థులు, తల్లిదండ్రులకు కీలక సమాచారం. ఆగస్టు నెలలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు పలుమార్లు సెలవులు రానున్నాయి. ముఖ్యంగా ఈ వారాంతం నుంచి వరుసగా మూడు రోజుల పాటు విద్యాసంస్థలు మూతపడే అవకాశం ఉండటంతో విద్యార్థులు, పేరెంట్స్ ముందుగానే తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. బోనాల ఉత్సవాలు, జాతీయ పండుగలు, ఇతర ప్రభుత్వ సెలవులు కలిసి ఈ నెలలో మంచి సంఖ్యలో విరామ దినాలు లభించనున్నాయి. తెలంగాణలో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో జరిగే ప్రధాన ఉత్సవాల కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆగస్టు నెలలో విద్యార్థులకు వరుస సెలవులు లభించే పరిస్థితి ఏర్పడింది.
School Holidays : తెలంగాణలో విద్యాసంస్థలకు భారీ సెలవులు.. ఆగస్టు హాలిడే లిస్ట్ ఇదే..!
బోనాల సందర్భంగా వరుసగా మూడు రోజుల సెలవులు
తెలంగాణలో బోనాల పండుగకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. జూలై 16న ప్రారంభమైన బోనాల ఉత్సవాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలు, పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని బోనాల జాతర ఈ వేడుకల్లో అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇప్పటికే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలు ఘనంగా నిర్వహించగా, ఆగస్టు 9న లాల్ దర్వాజా సింహవాహిని బోనాల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరుసటి రోజు ఆగస్టు 10న రంగం భవిష్యవాణి, గజవాహన ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ రోజున విద్యాసంస్థలకు సెలవు అమలు చేయనున్నట్లు సమాచారం. దీంతో ఆగస్టు 8న రెండో శనివారం, ఆగస్టు 9న ఆదివారం, ఆగస్టు 10న బోనాల సందర్భంగా సెలవు కలిపి వరుసగా మూడు రోజుల విరామం లభించనుంది. ఆగస్టులో మరిన్ని సెలవులు.. విద్యార్థులు, పేరెంట్స్ ముందుగానే ప్లాన్ చేసుకోండి.
ఈ మూడు రోజుల లాంగ్ వీకెండ్‌తో పాటు ఆగస్టు నెలలో మరికొన్ని ప్రభుత్వ సెలవులు కూడా ఉన్నాయి.
. ఆగస్టు 15 – స్వాతంత్ర్య దినోత్సవం
. ఆగస్టు 16 – ఆదివారం
. ఆగస్టు 26 – ఈద్-మిలాద్-ఉన్-నబీ
. ఆగస్టు 28 – రక్షా బంధన్
ఈ సెలవులు ఇప్పటికే ప్రభుత్వ క్యాలెండర్‌లో ప్రకటించబడ్డాయి.
అయితే గత వారం భారీ వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రత్యేకంగా సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ జిల్లాల్లో బోధనా దినాలను భర్తీ చేయడానికి ఆగస్టు 8న రెండో శనివారం కూడా పాఠశాలలు నిర్వహించాలని సంబంధిత అధికారులు సూచించినట్లు సమాచారం. కాబట్టి ఆయా జిల్లాల్లో స్థానిక విద్యాశాఖ ఆదేశాల ప్రకారమే సెలవులు, పని దినాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. వరుసగా మూడు రోజుల లాంగ్ వీకెండ్ రావడంతో చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు చిన్నపాటి విహారయాత్రలు, బంధువుల ఇళ్ల సందర్శనలు లేదా కుటుంబంతో కలిసి పర్యటనలకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే తమ ప్రాంతానికి సంబంధించిన అధికారిక సెలవుల ప్రకటనలను ఒకసారి తప్పకుండా పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






