AP : 5-15 ఏళ్ల విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..!
ప్రధానాంశాలు:
AP : పాఠశాల విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..!
AP : రాష్ట్రవ్యాప్తంగా 5 నుంచి 15 ఏళ్లలోపు పాఠశాల విద్యార్థులకు 90,000 కళ్లద్దాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇటీవల మంగళగిరిలోని ఆ శాఖ కార్యాలయంలో జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలపై మంత్రి సమీక్షిస్తూ నియోజకవర్గ స్థాయిలో కళ్లద్దాల పంపిణీకి తక్షణమే ఏర్పాట్లు చేయాలన్నారు. 45 ఏళ్లు పైబడిన గ్రామాల్లోని వారికి కూడా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు.
ప్రజలలో నేత్రదానం ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి అధికారులను కోరారు. ఎన్‌హెచ్‌ఎం ఆధ్వర్యంలో జరుగుతున్న పలు కార్యక్రమాల పురోగతిని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ మంత్రికి వివరించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు.
ఇక ఏపీలోని దివ్యాంగ విద్యార్థులకు మరో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి గుడ్‌న్యూస్ చెప్పారు. వారికి ప్రతినెలా పింఛన్‌ను నేరుగా అకౌంట్లలోనే జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలను అందిస్తామని చెప్పారు. దివ్యాంగుల కోసం వైజాగ్‌లో 20 ఎకరాల్లో రూ.200 కోట్లతో స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు.