Rushikonda Jagan Palace : కూలుతున్న జగన్ ప్యాలెస్..ప్రజల సొమ్ము నీళ్లపాలు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rushikonda Jagan Palace : కూలుతున్న జగన్ ప్యాలెస్..ప్రజల సొమ్ము నీళ్లపాలు..?

 Authored By sudheer | The Telugu News | Updated on :29 August 2025,5:00 pm

విశాఖపట్నం పర్యటనలో భాగంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రుషికొండలో గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన విలాసవంతమైన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన భవనాల లోపల ఉన్న అత్యంత విలాసవంతమైన బెడ్ రూమ్‌లు, బాత్ రూమ్‌లను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజాధనాన్ని ఇలా ప్యాలెస్‌ల నిర్మాణానికి వినియోగించడం ఎంతవరకు అవసరం అనే ప్రశ్నను లేవనెత్తుతూ, ప్రజా డబ్బును సరైన విధంగా వినియోగించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ భవనాన్ని చూస్తున్న సమయంలోనే సీలింగ్ పైపెచ్చులు ఉండడం చూసి షాక్ కు గురయ్యారు.

ఈ సందర్భంగా పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ రుషికొండ ప్రస్తుత పరిస్థితులను పవన్ కల్యాణ్‌కు వివరించారు. గతంలో ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా నిర్మించిన ఈ భవనాల నిర్వహణకే కోటి రూపాయలకుపైగా బకాయిలు పేరుకుపోయాయని వెల్లడించారు. ఈ నిర్మాణాలపై గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు కొనసాగుతోందని, ఆర్థికపరంగా, పర్యావరణపరంగా ఇది భారమవుతోందని అధికారులు వివరించారు.

పరిస్థితిని సమీక్షించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ప్రకృతిని విస్మరించి ఇలాంటి నిర్మాణాలు చేస్తే ఉన్న సౌందర్యం కూడా నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. రుషికొండ నిర్మాణాల ఖర్చు, పర్యావరణ ప్రభావం, విధ్వంసం వంటి అంశాలపై శాసనసభ వేదికగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ప్రతిపక్షంగా ఉండగా ఈ నిర్మాణాలను పరిశీలించనీయలేదని గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగంగా ప్రజల ముందుకు నిజాలను తెచ్చే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. భవనాలు పాడైపోకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Tags :

    sudheer

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది