Pawan Kalyan : పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి.. కేంద్రం నుండి ఏపీకి అందిన తీపి కబురు
Pawan Kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. కేంద్ర ప్రభుత్వం కూడా కూటమిలో భాగం కావడంతో ఏపీకి వరాల జల్లు కురుస్తుంది. తాజాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో భాగంగా కేంద్రం రాష్ట్రానికి అదనంగా 6.50 కోట్ల పనిదినాలు కేటాయించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. మొదట మంజూరు చేసిన 15 కోట్ల పనిదినాలు జూన్ నెలాఖరుకే పూర్తికాగా.. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో అదనపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. మరో 6.50 కోట్ల పనిదినాలకు ఆమోదం తెలిపినట్లు పవన్ తెలిపారు.
Pawan Kalyan : ఏపీకి కేంద్రం శుభవార్త..
2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం పంపిన ప్రతిపాదనల మేరకు కేంద్ర ప్రభుత్వ లేబర్ బడ్టెట్‌ను 21.50 కోట్ల పనిదినాలకు పెంచడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అంగీకరించిందని డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. పెరిగిన పనిదినాల వల్ల ఉపాధిహామీ పథకంలో పనిచేసే 54 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని ఆయన తెలిపారు. ఢిల్లీలో మంగళవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యాన జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనను అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు కూలీలకు చెల్లించాల్సిన బకాయిల సత్వర విడుదలకు సమ్మతించారని పవన్‌కల్యాణ్ తెలిపారు.
ఇక రాష్ట్రంలో అటవీశాఖ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనపై సీరియస్‌గా స్పందించారు. అటవీశాఖ అధికారులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. అటవీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు.మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై ప్రధానంగా చర్చించారు .రాష్ట్రం నుంచి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే వారికి తగిన సహకారం అందించాలని లార్సన్‌ను డిప్యూటీ సీఎం కోరారు.