CBN – Roja : జగన్ కాలర్ ఎగరేసుకునే పని చేసిన ఆర్కే రోజా
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నగరి సభలో జనసమీకరణ లేక ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయని, ఇది ఒక ‘అట్టర్ ప్లాప్’ షో అని ఆమె అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు పనిచేసినా, సొంత జిల్లాలోని నగరి నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమీ లేదని, అందుకే చెప్పుకోవడానికి పనులు లేక వైఎస్ జగన్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. సభ కోసం స్థానిక ఆసుపత్రిలోని రోగులను సైతం ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించారు.
CBN – Roja : జగన్ కాలర్ ఎగరేసుకునే పని చేసిన ఆర్కే రోజా
జగన్ హయాంలోనే నగరి అభివృద్ధి
నగరి అభివృద్ధి విషయంలో జగన్ ప్రభుత్వానిదే పైచేయి అని రోజా గణాంకాలతో వివరించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పునాది పడిన 100 పడకల ఆసుపత్రిని జగన్ కాలంలోనే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని, డయాలసిస్ సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పాలిటెక్నిక్ కాలేజీలు, షాదీ మహల్ వంటి అనేక నిర్మాణాలు తమ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న ముద్దుకృష్ణమనాయుడు, ఆయన కుమారుడు భానుప్రకాష్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, రైతు భరోసా కేంద్రాలు మరియు సచివాలయాల వ్యవస్థ ద్వారా తాము పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లామని స్పష్టం చేశారు.
చంద్రబాబు పై రోజా ఫైర్
ముఖ్యంగా భూముల రీసర్వే అంశంపై చంద్రబాబు ద్వంద్వ వైఖరిని రోజా ఎండగట్టారు. గతంలో జగన్ భూములను కాజేస్తారని విష ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే రీసర్వేను తమ గొప్పతనంగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. జగన్ తెచ్చిన ఆధునిక టెక్నాలజీ, డ్రోన్లు, హెలికాప్టర్లను వాడుకుంటూ, కేవలం పాస్‌బుక్‌ల అట్టలు మార్చి ‘కాపీ క్యాట్’ లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రవేశపెట్టిన సర్వే వల్ల ప్రభుత్వానికి రూ. 400 కోట్ల రాయితీ వచ్చిందని, ధైర్యముంటే ఆ సర్వేను రద్దు చేయాలని ఆమె సవాలు విసిరారు.