TDP : కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ నేతల ప్రశంసలు.. చంద్రబాబు కృషి ఫలించిందంటూ కామెంట్..!
ప్రధానాంశాలు:
TDP : కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ నేతల ప్రశంసలు.. చంద్రబాబు కృషి ఫలించిందంటూ కామెంట్..!
TDP : కొద్ది సేపటి క్రితం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ మధ్య తరగతి వారికి అనుకూలంగా ఉంది. అయితే ఈ బడ్జెట్‌లో ఏపీకి కూడా కొంత ప్రయోజనాలు చేకూరాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం మరోసారి స్పష్టంగా హామీ ఇవ్వడం శుభ పరిణామం. ఆగిపోయిన వెనుకబడిన ప్రాంతాలకు నిధులిస్తామని చెప్పడం రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.. ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి కేంద్రం ప్రకటన ఆర్థిక తోడ్పాటు ఇస్తుంది.. ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. ఏపీలో పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం ఇవ్వడం వల్ల పారిశ్రామికాభివృద్ధి సాధ్యపడుతుంది.
TDP ఫలితం వచ్చింది..
కేంద్ర బడ్జెట్ కేటాయింపులతో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటాయి. స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు పడడానికి కేంద్ర బడ్జెట్ ఉపకరిస్తుంది. ఏపీ ఏం ఆశించిందో వాటిని కేంద్రం బడ్జెట్‌లో పొందుపర్చడం సంతోషదాయకమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇవ్వడంతో రాజధాని పనులను పరుగులు పెట్టించవచ్చని అన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఫలించాయి. ఏపీపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రధాని మోదీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేంద్ర పథకాలు చాలా ఉపయోగంగా ఉంటాయి.. గత ఐదేళ్లల్లో జగన్ రుణాలే తెచ్చారు.. మేం నిధులు తెస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం అమరావతిని, పోలవరం ప్రాజెక్టును నాశనం చేస్తే మేం రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ పనులను గాడిలో పెడుతున్నామని యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు .జ కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించడం పట్ల కూడా వారు హర్షం వ్యక్తం చేశారు.