Rajadhani : మనోవేదనకి గురవుతున్న అమరావతి రైతులు.. అవమానిస్తున్నారంటూ ఆవేదన.!
ప్రధానాంశాలు:
Rajadhani : మనోవేదనకి గురవుతున్న అమరావతి రైతులు.. అవమానిస్తున్నారంటూ ఆవేదన.!
Rajadhani : ఏపీలో ప్రభుత్వం మారింది.. కూటమి అధికారంలోకి వచ్చింది.. అమరావతికి పట్టిన గ్రహణం వీడింది.. రాజధానికి మంచిరోజులొచ్చాయి.. తద్వారా రైతుల తలరాతలు మారబోతున్నాయి.. ఐదేళ్ల రైతుల కష్టాలు తీరబోతున్నాయి.. ఇదంతా నాణానికి ఒక పక్క మాత్రమే! రెండోవైపు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా.. అసైన్డ్ రైతుల తలరాతలు మాత్రం మారలేదు. వైసీపీ పాలనలో మొదలైన వారి ఆకలి కేకలు, ఆర్తనాదాలు ఇప్పటికీ అలానే కొనసాగుతున్నాయి. కూటమి ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలూ అమలుకు నోచక విలవిల్లాడుతున్నారు. సీఎం చంద్రబాబే తమ గోడు వినిపించుకోవాలని వేడుకుంటున్నారు.
Rajadhani అన్నీ అవమానాలే..
రాజధాని కోసం 3,139 మంది అసైన్డ్ రైతులు 2,689.14 ఎకరాల భూమిని రాజధాని కోసం త్యాగం చేశారు. అప్పట్లో ఆ భూములు ప్రభుత్వానికి ఇవ్వొద్దని కొందరు వారిపై ఒత్తిడి తెచ్చినా భూములిచ్చారు. వైసీపీ హయాంలో ఆ రైతులపై సీఐడీ కేసులు పెట్టింది. ఆ భూములపై సీఐడీ విచారణకు ఆదేశించింది. అప్పటి వరకూ ఫారం- 9.14 కింద ఏడేళ్లపాటు వారికి ఇచ్చిన కౌలును, సీఐడీ విచారణ సాకుతో ఆపేసింది. ఇప్పటికీ వెయ్యి కుంటుంబాలకు చెందిన 1650 ఎకరాల భూమి నాట్ ట్యాలీడ్ జాబితాలోనే ఉంది. దీంతో వారికి కౌలు రావడంలేదు. వైసీపీ ప్రభు త్వం కక్షపూరితంగా పెట్టిన సీఐడీ కేసులనే సాకుగా చూపి కౌలు చెల్లించకుండా ఆపేశారు. కూటమి ప్రభుత్వం పట్టాదారు రైతులకు కౌలు చెల్లించినా, అసైన్ట్ రైతుల కౌలు మాత్రం చెల్లించలేదు.
ప్రభుత్వం మారినా సీఆర్డీఏ అధికారుల తీరు మారలేదు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్తే నేటికీ అవమానాలే ఎదురవుతున్నాయని కౌలు రైతులు వాపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పరిస్థితి కంటే అత్యంత అమానవీయంగా అధికారుల తీరు ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. సాక్షాత్తూ సీఆర్డీఏ అదనపు కమిషనరే తమను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆక్రోశిస్తున్నారు. ఇక, అసైన్డ్ రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రస్తుత తాడికొండ ఎమ్మెల్యే వారికి ఇటీవల హామీ ఇచ్చినా.. ఆచరణ లేదు. దీనిపై రైతులు ఆయనను మరోమారు ప్రశ్నించగా.. మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి లోకేశ్‌ను కలవండని ఉచిత సలహా ఇచ్చినట్లు అసైన్డ్ రైతులు చెబుతున్నారు.