Ys Jagan : బాబు అడ్డాపై జగన్ ఫోకస్..!
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో చేసిన తప్పులను సరిచేసుకుంటూ కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం అంటున్నాడు. వరుస పర్యటనలతో ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఇదే క్రమంలో కూటమి ఏడాది పాలనపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఉమ్మడి గుంటూరులో నిర్వహించిన ఉద్యమానికి కొనసాగింపుగా, ఇప్పుడు చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 9వ తేదీన బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌ను సందర్శించబోతున్నారు. గిట్టుబాటు ధరల లేక ఆర్థికంగా కుదేలవుతున్న మామిడి రైతులకు మద్దతుగా జగన్ అడుగులు వేయనున్నారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి బాధలను తెలుసుకోనున్నారు.

Ys Jagan : బాబు అడ్డాపై జగన్ ఫోకస్..!
Ys Jagan : కూటమి ప్రభుత్వం పై జగన్ దూకుడు
ఈ సందర్బంగా వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో లక్షల హెక్టార్లలో సాగు చేసిన మామిడి పంట కొనుగోలు లేకుండా పాడైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తమ పంటలను మార్కెట్‌కు తీసుకొచ్చినా, కొనుగోలుదారుల కోసం గంటలు వేచి చూసి చివరికి వాటిని రోడ్డుపైనే పారవేస్తున్న పరిస్థితిని వివరించారు. పల్ప్ పరిశ్రమలు ఉన్నప్పటికీ, కొనుగోళ్లు జరగడం లేదని, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబు సొంత జిల్లాలో రైతులు ఇలా నష్టపోతున్నా, ప్రభుత్వ స్పందన కనిపించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.
పల్ప్ ఫ్యాక్టరీలపై జరిగిన ఆరోపణలతో కూడిన విమర్శలు రాజకీయంగా తీవ్రంగా మారుతున్నాయి. జిల్లాలో 98 శాతం పల్ప్ యూనిట్లు టిడిపికి చెందినవేనని పెద్దిరెడ్డి తెలిపారు. అయినప్పటికీ, కొనుగోళ్ల కోసం వాటిని వాడకపోవడం, పైగా దానికి వైఎస్ఆర్సీపీపై నెపం నెట్టడం చంద్రబాబు శైలిగా మారిందని ఆరోపించారు. మామిడి రైతులను ఆదుకోవాల్సిన బదులు, విషయాన్ని దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో జగన్ స్వయంగా రైతుల మద్దతుగా బంగారుపాళ్యాన్ని సందర్శించి, వారికి న్యాయం జరిగేలా కృషి చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఈ పర్యటనతో రాష్ట్రంలో రైతుల సమస్యలపై మరింత చర్చ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.