YS Jagan : వైఎస్ జగన్‌లో తగ్గిన మునుపటి జోష్.. కారణం అదేనా ?
ప్రధానాంశాలు:
YS Jagan : వైఎస్ జగన్‌లో తగ్గిన మునుపటి జోష్.. కారణం అదేనా ?
YS Jagan : నాలుగు నెలల మౌనం తర్వాత వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. ఓటమి షాక్ నుంచి బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శల యుద్ధం మొదలుపెట్టారు. అయితే ఆయనలో మునుపుటి దూకుడు మాత్రం ఇంకా కనిపించడం లేదు. జగన్ కేసుల విషయంలో భయపడుతున్నారని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన వరుసగా తన పర్యటనలను రద్దు చేసుకుంటూ వస్తున్నారు. మొన్న తిరుమల పర్యటన రద్దు చేసుకుంటే.. తాజాగా పుంగనూరు పర్యటనను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. పుంగనూరులో ఆరేళ్ల బాలిక హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన మిస్టరీ వీడలేదు.
బాలిక అదృశ్యమైన మూడు రోజుల తర్వాత శవంగా లభించింది. హంతకులను ఆచూకీకి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు పాప హత్య కేసులో ఆర్థిక లావాదేవీల అంశం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన జగన్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతిభద్రతలు క్షీణించాయని.. అదుపు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. అక్టోబర్ 9న బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు తెలిపారు. అయితే ఈ పర్యటన కూడా రద్దు చేసుకున్నట్లు తాజా సమాచారం.
నిందితులు దొరికారు అన్న నేపథ్యంలో జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నట్టు పేర్కొనడం చర్చనీయాంసంగా మారింది. ఇప్పటికే వైసీపీ నేతలను వరుస కేసులు వెంటాడుతున్నాయి.. మరోపక్క పార్టీకి విధేయులుగా ఉన్నవారంతా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. వరుస కేసులు వెన్నాడుతున్న నేపథ్యంలో లేనిపోని సమస్యలు వస్తాయి కాబట్టి దూకుడు కాస్త తగ్గించుకుంటే మంచిదని జగన్ భావించినట్లు సమాచారం.