Ysrcp : వైసీపీకి అప్పుడే ఊరట.. సుధ విజయం ఖాయం?
Ysrcp : ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలులో ఉప ఎన్నిక పోలింగ్ శనివారం జరగనుంది. ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీలు బరిలో ఉన్నాయి. అధికార వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. అయితే, మొత్తంగా 15 మంది అభ్యర్థులుండగా, అధికార వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ కేంద్రీకృతమై ఉంటుందని స్థానిక ప్రజానీకం అంటోంది.
పోలింగ్ ఓటర్లు తరలివచ్చేలా ఇప్పటికే అధికార వైసీపీ నేతలు ప్లాన్ చేశారు. బద్వేలు సిట్టింగ్ శాసన సభ్యుడు వెంకట సుబ్బయ్య మరణంతో ఈ నియోజకవర్గానికి బై పోల్ వచ్చింది. అయితే, ఉప ఎన్నిక నేపథ్యంలో వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. దాంతో అనూహ్యంగా సుధకు మద్దతు తెలుపుతూ ప్రతిపక్ష టీడీపీ, జనసేన ఎన్నిక నుంచి తప్పుకున్నాయి. అలా ఏకగ్రీవ ఎన్నికకు టీడీపీ, జనసేన సహకరించాయి. కానీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం పోటీలో ఉండటంతో ఏకగ్రీవం కాస్తా ఎన్నికగా మారింది. పోలింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈ బై పోల్‌లో ప్రాంతీయ పార్టీతో రెండు జాతీయ పార్టీలు తలపడనున్నాయి. అయితే, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో గెలుపు ఖాయమనే ధీమాను వైసీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ప్రచారానికి సీఎం జగన్ రాకపోయినప్పటికీ ఈ ఉప ఎన్నిక కోసం ప్రత్యేకంగా ఇన్‌చార్జిలను నియమించారు. అలా బైపోల్‌పై కాన్సంట్రేషన్ బాగానే చేశారు సీఎం జగన్. ప్రచారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని జగన్ ఆదేశాలు ఇవ్వడంతో వైసీపీ నేతలు ముమ్మర ప్రచారమే చేశారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక మాదిరిగానే ప్రతీ ఇంటి గడపకూ వైసీపీ వెళ్లి ప్రచారం చేసింది. అయితే, స్థానికంగా ఉండే రాజకీయ వర్గాల అంచనా ప్రకారం అధికార వైసీపీ విజయం ఖాయమని తెలుస్తోంది. బలమైన ప్రాంతీయ పార్టీగా వైసీపీ ఉండటంతో పాటు అధికారంలో ఉండటం, దానికి తోడు ప్రతిపక్ష టీడీపీ, జనసేన బహిరంగంగానే వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం కలిసొచ్చే అంశాలని పలువురు అంటున్నారు. వైసీపీ తర్వాత రెండో స్థానంలో బీజేపీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.