Anil Ambani : అనిల్ అంబానీకి గట్టి ఎదురుదెబ్బ…వేల కోట్ల ఆస్తులు ఫసక్
ED Tightens Noose on Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఏడీఏజీ (ADAG) గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి కష్టాలు ముగిసేలా కనిపించడం లేదు. గతంలో తీసుకున్న భారీ రుణాలు, వాటి మళ్లింపు ఆరోపణలు ఇప్పుడు ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. తాజాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి ఉక్కుపాదం మోపింది. తాజాగా రూ. 1,800 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దీంతో ఈ కేసులకు సంబంధించి ఇప్పటివరకు అనిల్ అంబానీ సంస్థల నుండి జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ అక్షరాలా రూ. 12,000 కోట్లకు చేరుకుంది. యెస్ బ్యాంక్ మోసం కేసుతో పాటు రిలయన్స్ కమ్యూనికేషన్స్, హోమ్ ఫైనాన్స్ సంస్థల్లో జరిగిన ఆర్థిక అవకతవకలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్యలు తీసుకున్నారు.
Anil Ambani : అనిల్ అంబానీకి గట్టి ఎదురుదెబ్బ…వేల కోట్ల ఆస్తులు జప్తు
అటాచ్ చేసిన ఆస్తుల వివరాలు
ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో కేవలం నగదు మాత్రమే కాకుండా, కీలక కంపెనీల్లోని వాటాలు కూడా ఉన్నాయి. బీఎస్ఈఎస్ రాజధాని పవర్, బీఎస్ఈఎస్ యమునా పవర్, మరియు ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఉన్న వాటాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ముంబైలోని విలాసవంతమైన నివాస సముదాయాలు, వివిధ నగరాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ స్థలాలు, భారీ మొత్తంలో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా అటాచ్ చేశారు. కేవలం అనిల్ అంబానీ ఆస్తులే కాకుండా, సంస్థకు చెందిన ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వ్యక్తిగత ఆస్తులను కూడా దర్యాప్తు సంస్థ వదలకపోవడం గమనార్హం.
రుణాల మళ్లింపు
యెస్ బ్యాంక్ నుంచి సుమారు రూ. 12,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న రిలయన్స్ గ్రూప్, ఆ నిధులను ఉద్దేశించిన అవసరాలకు కాకుండా షెల్ కంపెనీల ద్వారా ఇతర ప్రయోజనాలకు మళ్లించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ వ్యవహారంలో ఫెమా (FEMA) నిబంధనల ఉల్లంఘన కూడా జరిగినట్లు ఈడీ నిర్ధారించింది. గతేడాది అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీపై కూడా సీబీఐ కేసు నమోదు చేయడంతో అంబానీ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మళ్లీ వ్యాపార రంగంలోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్న తరుణంలో, ఈ భారీ ఆస్తుల జప్తు అనిల్ అంబానీ భవిష్యత్తు ప్రణాళికలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది.