Pancha Bhutha Lingalu : పంచ భూత లింగాలు ఏవి, అవెక్కడ ఉన్నాయి, వాటి ప్రాశస్త్యం ఏమిటి?
Pancha Bhutha Lingalu : పృథ్వి, జలం, నిప్పు, వాయువు, ఆకాశం అనేవి పంచ భూతాలు. శివుడు ఈ పంచ భూతాల స్వరూపాలైన లింగ రూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. 1. పృథ్వీలింగం – కంచి 2. జల లింగం – జంబుకేశ్వరం 3. తేజో లింగం -తిరువణ్ణామలై 4. వాయు లింగం – శ్రీకాళ హస్తి 5. ఆకాశ లింగం – చిదంబరం. ఇందులో కంచి, జంబుకేశ్వరం, తిరువణ్ణామలై, చిదంబరం అనే క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. శ్రీకాళహస్తి తిరుపతికి సమీపంలో ఉన్నది.కంచిలోని ఏకామ్రేశ్వరుడు పృధ్వీ లింగరూపమై ఉన్నాడు. ఇక్కడి ఏరఫ మైన మామిడిచెట్టు కారణంగా ఈ దేవుడు ఏకామ్రేశ్వరుడయ్యాడు. కంచి ఏడు ముక్తి దాయక క్షేత్రాలలో ఒకటి.
రామేశ్వరంలోని సైకత లింగం కూడా పృధ్వీ లింగమే. జంబుకేశ్వరంలోని జల లింగం జలమయమై వుంటుంది. శివునకు జలం చాలా ఇష్టం. ఆ దేవుడు అభిషేక ప్రియుడు. ఈక్షేత్రం తమిళ నాడులోని తిరుచినా పల్లి వద్ద ఉన్నది. దక్ష హింస వల్ల కల్గిన పాపాన్ని తొలగించుకోవడానికి శివుడు జంబుకేశ్వరంలో తపస్సు చేశాడని పురాణ గాధ.తమిళనాడులోని అరుణాచలం తేజో లింగ నిలయం. అరుణాచలం చుట్టూ చేసే ప్రదక్షిణం మహాపుణ్య ప్రదమంటారు. శ్రీ రమణ మహర్షి ఈ క్షేత్రంలో తపోనిష్టుడై వుండి జ్ఞాన మార్గో పదేశంతో ప్రసిద్ధి పొందాడు. శ్రీ కాళహస్తిని దక్షిణ కైలాసం అంటారు. ఇక్కడ వాయు లింగప్రతిష్ఠితమైనది. సాలె పురుగు, పాము, ఏనుగు అనే తిర్యగంతువులు ఇక్కడి శివ లింగాన్ని సేవించి ముక్తి పొందాయని శివ పురాణం చెబుతున్నది.
అందు వల్లనే శ్రీ కాళ హస్తిగా ఈక్షేత్రం ప్రశస్తి కెక్కింది. ఆకాశ లింగం చిదంబరంలో ఉన్నది. ఇక్కడ ఏవిధమైన లింగా కారమూ కనిపించక నిరాకారమైన అంత రాళమే కానవస్తుంది. ఇది రూప రహిత లింగం. అందు వల్లనే ఆకాశ లింగంగా ప్రసిద్ధి గాంచింది. ఆకాశం లాగా శివుడు లేక ఆత్మ సర్వ వ్యాపి అని దీని వల్ల తెలుస్తుంది. ఈ క్షేత్రం నిర్వికల్ప సమాధికి దోహదకారి. ఇలా పంచ భూతాలకు ప్రతీకలైన ఈ లింగాలు పాంచ భౌతికమైన జగమంతా దైవ స్వరూపమే అని చాటుతున్నాయి. అయితే ఈ స్థలాల్లో ఉన్న పంచ లింగాలను దర్శించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు.