RRR Movie : వివాదంలో ఆర్ఆర్ఆర్ మూవీ.. హైకోర్టును ఆశ్రయించిన ఏపీ మహిళ..!
RRR Movie : దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన సినిమా ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సరిగ్గా కొన్ని రోజుల ముందే పోస్ట్ పోనై అందరినీ నిరాశపరిచింది. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామన్న ధీమాతో మూవీ ప్రమోషన్ భారీగా నిర్వహించిన చిత్ర బృందం పలు కారణాలతో బరి నుంచి తప్పుకుని వార్తల్లో నిలవడంతో పాటు ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై తెలంగాణ హైకోర్టులో ఏపీ, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ పిల్ దాఖలు చేసింది.
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో దర్శకుడు రాజమౌళి… హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లను చారిత్రక యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల పాత్రలను వక్రీకరించి చూపిస్తున్నారని అల్లూరి సౌమ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహనీయుల చరిత్రను తప్పుగా తెరకెక్కించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. రాజమౌళి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే ఈ సెన్సార్ సర్టిఫికేట్‌ను కూడా రద్దు చేసి, సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టును కోరారు. రాజమౌళితో పాటు, సెన్సార్ బోర్డ్, చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య, రచయత విజయేంద్ర ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇవిడ పిటిషన్ పై కోర్టు ఏ విధంగా తీర్పునిస్తుందో తెలియాల్సి ఉంది.