Mythri Movie Makers : ఇలా అయితే మైత్రి మూవీ మేకర్స్ వారు దుఖాణం సర్దేసుకోవాల్సి వస్తుందేమో..!
Mythri Movie Makers : 2015 సంవత్సరంలో మహేష్ బాబుతో నిర్మించిన శ్రీమంతుడు సినిమా తో నిర్మాణ సంస్థగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా అడుగు పెట్టారు. అంతకు ముందు వరకు అమెరికాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. సినిమా పై ఆసక్తి మరియు సినిమా ల్లో మంచి ఆదాయం వస్తుందనే ఉద్దేశ్యంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. మొదట్లో కాస్త మెల్ల మెల్లగానే సినిమాలు చేసినా కూడా ఇప్పుడు వారి స్పీడ్ ముందు ఎవరు నిలవడం లేదు. ఈ ఏడాదిలో వారి బ్యానర్ నుండి ఇప్పటికే రెండు వచ్చాయి. మరో నాలుగు అయిదు సినిమాలు రాబోతున్నాయి. ఏడాదికి అరడజను సినిమాలను నిర్మిస్తున్న ఘనత కేవలం మైత్రి వారికే దక్కింది అంటూ సినీ విశ్లేషలకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతా బాగానే ఉంది కాని మైత్రి వారు నిర్మిస్తున్న సినిమాల్లో మెజార్టీ సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. ఇటీవల వారి నుండి వచ్చిన సినిమా ల్లో పుష్ప 1 మంచి వసూళ్లు నమోదు చేసింది. ఆ తర్వాత విడుదల అయిన సర్కారు వారి పాట సినిమా పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు సాధించింది. ఇక ఇటీవల విడుదల అయిన అంటే సుందరానికి సినిమా వసూళ్ల విషయం లో చాలా నిరాశ మిగిలింది. నాని సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా వసూళ్లు మాత్రం నిరాశ పర్చాయి. రాబోయే సినిమాల విషయంలో ఫలితం ఎలా ఉంటుందో అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో మైత్రి వారు మాత్రం భారీ విజయాలు రాబోతున్నాయంటున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ వారు వందల కోట్ల బడ్జెట్ సినిమాల నుండి మొదలుకుని పది కోట్ల బడ్జెట్ సినిమా వరకు తెరకెక్కిస్తున్నారు. ప్రతి సినిమా ను కూడా వారు చాలా స్పెషల్ కేర్ తీసుకుని నిర్మిస్తున్నారు. అదుగో ఇదుగో అంటూ మైత్రి వారు ఏదో ఒక సినిమా పబ్లిసిటీ తో మీడియాలో ఉంటున్నారు. మైత్రి వారు చేస్తున్న ఖర్చుకు సినిమా లు రాబడుతున్న వసూళ్లకు కాస్త వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఎక్కువ సినిమా లకు నష్టాలు వస్తున్నాయి అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యం లో మైత్రి మూవీ మేకర్స్ వారు త్వరలోనే దుఖాణం సర్దేసుకోవాల్సి వస్తుందేమో అంటూ కొందరు హెచ్చరిస్తున్నారు. కథల ఎంపిక దర్శకుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు.