మహమ్మారిని జయించిన 110 ఏళ్ల వృద్ధుడు.. ఈ తాతను మనమంతా ఆదర్శంగా తీసుకోవాల్సిందే?
ప్రస్తుతం దేశమంతా గగ్గోలు పెడుతోంది. మహమ్మారిని చూసి భయపడుతోంది. వయసు మళ్లిన వాళ్లే కాదు.. యూత్ కూడా సెకండ్ వేవ్ తో అల్లాడుతోంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించడంతో అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఎక్కడ చూసినా రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. అయితే.. ఈ మహమ్మారిని జయించాలంటే కావాల్సింది గుండె ధైర్యం. అది ఉంటే.. ఎంత వయసు ఉన్నవాళ్లకైనా సరే.. అది ఒంట్లో నుంచి పారిపోవాల్సిందేనని ఓ తాత నిరూపించాడు. ఆయన వయసు ఎంతో తెలుసా 110 ఏళ్లు. 110 ఏళ్ల తాత.. ఆ మహమ్మారిని జయించి.. ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. పదండి.. ఆ తాత స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
ఆ తాత పేరు రామానంద తీర్థ. ఉండేది హైదరాబాద్ కు సమీపంలోని కీసరలో ఉన్న ఓ ఆశ్రమంలో. తాతకు నా అనే వాళ్లు ఎవ్వరూ లేరు. ఒక్కడే ఆ ఆశ్రమంలో ఉంటాడు. కానీ.. గట్టోడు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు కానీ.. ఇటీవల ఆశ్రమంలో ఆ మహమ్మారి సోకింది. దీంతో కొద్దిగా ఆయనకు లక్షణాలు కనిపించాయి. దీంతో ఆశ్రమం నిర్వాహకులు తాతను సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే గాంధీ ఆసుపత్రి డాక్టర్లు.. తాతకు ట్రీట్ మెంట్ చేయడం ప్రారంభించారు. ఏప్రిల్ 24న తాత.. గాంధీ ఆసుపత్రిలో చేరాడు. అప్పటి నుంచి ట్రీట్ మెంట్ నడుస్తోంది. అసలు.. తాత బతుకుతాడని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే.. తాత వయసు ఇప్పటికే 110 ఏళ్లు దాటింది. చిన్న చిన్న వయసు వాళ్లే కరోనాతో అల్లాడుతుంటే.. తాత బతుకుతాడా? అని అంతా అనుకున్నా.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ… ఆ వృద్ధుడు కరోనాను జయించాడు.
తాతకు కరోనా నెగెటివ్ వచ్చింది
తాతను దగ్గరుండి చూసుకున్న గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు ఏమన్నారంటే… తాత జాయిన్ అయినప్పుడు లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి. అయినా కూడా మేము ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశాం. తాత నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించారు. ఆయనకు ఇతర ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడంతో తాత మహమ్మారిని జయించడం సులువు అయింది.. అని డాక్టర్ వెల్లడించారు.