Costly Elections : తెలంగాణలో మళ్లీ అత్యంత ఖరీదైన ఎన్నికలు.. ఈసారి ఒక్క ఓటు విలువ రూ. లక్షల్లోనే..!
Costly Elections : తెలంగాణలో మళ్లీ అత్యంత ఖరీదైన ఎన్నికలు జరగబోతున్నాయి. మొన్న జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటుకు రూ.6 నుంచి 10 వేల వరకు అధికార టీఆర్ఎస్ పార్టీ పంచి పెట్టింది. మొత్తంగా దాదాపు రూ.600 కోట్లకు పైగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టినట్లు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ సారి జరగబోయే ఈ ఎన్నికల్లో ఓటుకు రూ.వేలల్లో కాకుండా రూ.లక్షల్లో వెల కట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఏ ఎన్నికలు తెలంగాణలో జరగబోతున్నాయంటే..స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఓట్లతో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తమ ఓటుకు భారీ డిమాండ్ ఉండాలని అనుకుంటున్నారు.
Costly Elections : ఓటుకు అంత డిమాండ్ చేయాలంటున్నరు..
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలానికి చెందిన ఓ ఎంపీటీసీ తన ఓటును రూ.లక్షలకు విలువ కట్టినట్లు బాహాటంగానే పేర్కొన్నాడు. ఉప ఎన్నికలో ప్రజలకు లక్షలకు లక్షలు పంచిన అధికార టీఆర్ఎస్ పార్టీ..ప్రజా ప్రతినిధి ఎంపీటీసీ అయిన తనకు ఎంత ఇవ్వాలో నిర్ణయించుకోవాలని చెప్పాడు. తాను ఎంపీటీసీగా గెలిచి ఏం చేయాలో ఇంత వరకు తెలియలేదని, ఇప్పుడు తను ఓటేస్తేనే ఎమ్మెల్సీ అయితరన్న విషయం తెలిసిందని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే తన ఓటుకు లక్షలకు లక్షలు ఇవ్వాల్సిందేనని, లేదంటే తాను స్వంతంత్ర అభ్యర్థికి ఓటు వేస్తానని సదరు ఎంపీటీసీ బాహాటంగానే చెప్పాడు.
అలా మొత్తంగా స్థానిక సంస్థల మండలి పోరు అత్యంత ఖరీదైన ఎన్నికగా మారబోతున్న సంకేతాలు ఇప్పటికే వస్తున్నాయి. ఇలా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తమ ఓటు వేసేందకుగాను ఐదారు లక్షలు డిమాండ్ చేసినట్లయితే హుజురాబాద్ ఉప ఎన్నిక కంటే కూడా ఈ ఎన్నికకు చాలానే ఖర్చు అవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎంపీటీసీలంత కూడా ఒక ఉమ్మడి నిర్ణయానికి వచ్చి ఓటు వేసేందుకుగాను తమకు లక్షల్లో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసే చాన్సెస్ ఉండొచ్చని పలువురు అంటున్నారు.