Police | నిరుద్యోగులకి గుడ్ న్యూస్.. ఏకంగా 11 వేల పోలీసు ఉద్యోగాలు..
Police | ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు మరో మంచి వార్తను అందించబోతుంది రాష్ట్ర పోలీసు శాఖ. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వేలాది పోలీస్ ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్నట్టు తాజా సమాచారం. సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వు, ఏపీఎస్‌పీ, స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వు (సీపీఎల్), పీటీఓ, కమ్యూనికేషన్స్ వంటి విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డీజీపీ కార్యాలయం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
#image_title
శుభవార్త..
డీజీపీ కార్యాలయం పంపిన ప్రతిపాదనల ప్రకారం, మొత్తం 315 ఎస్‌ఐల భర్తీకి ప్రణాళిక సిద్ధమైంది. ఇందులో సివిల్ విభాగంలో 182 ఎస్‌ఐలు, ఆర్మ్డ్ రిజర్వులో 116 ఎస్‌ఐలు, స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వు సీపీఎల్‌లో 18 ఎస్‌ఐలు, ఏపీఎస్‌పీలో 53 ఎస్‌ఐలు, కమ్యూనికేషన్స్ విభాగంలో 61 ఎస్‌ఐలు, పీటీఓ విభాగంలో 14 ఎస్‌ఐల పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ ఉద్యోగాల విభాగంలో కూడా భారీగా ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 3622, ఆర్మ్డ్ రిజర్వులో 2000, ఏపీఎస్‌పీ డ్రైవర్ పోస్టులు 198, కమ్యూనికేషన్ విభాగంలో 298 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి డిమాండ్ ఉంది.
ఈ ఏడాది ఆగస్టు 31 వరకు వివిధ విభాగాల్లో గుర్తించిన ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపించగా, రాష్ట్రంలో శాంతిభద్రతలను సమర్థంగా నిర్వహించేందుకు తగిన సిబ్బంది అవసరమని పోలీసు శాఖ స్పష్టం చేసింది. కొత్త కొత్త రకాల నేరాలు, సైబర్ క్రైం పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ బలగాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో త్వరగా అనుమతులు మంజూరు చేసి, నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డీజీపీ కార్యాలయం సూచించింది.