KTR: విచారణకి రావాలంటూ కేటీఆర్‌కి ఏసీబీ పిలుపు.. సర్వత్రా ఉత్కంఠ
KTR : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిసేలా కనిపిస్తుంది. కార్ రేస్ నిర్వాహణలో నిబంధనలు ఉల్లంఘించారని కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ ఇప్పుడు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఫెమా ఉల్లంఘన చట్టం ప్రకారం నిధులను విదేశాలకు తరలించారనే ఆరోపణల నేపథ్యంలో అతనిపై ఏసీబీ కేసు నమోదు చేయడమే కాకుండా ఏ1గా అతనిని చేర్చింది.కేటీఆర్‌కు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జనవరి 6వ తేదీ ఉదయం 10 గంటలకు ఫార్ములా ఈ-రేస్ కేసులో విచారణ రావాలని కోరుతూ సమన్లు జారీ చేసింది.
KTR టెన్షన్.. టెన్షన్..
అంతకుముందు డిసెంబర్ 31న తెలంగాణ హైకోర్టు ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ అరెస్టుపై స్టేను పొడిగించింది.. కేటీఆర్ పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. అయితే.. విచారణ కొనసాగించేందుకు కోర్టు అనుమతించింది. ఫార్ములా ఈ కారు రేస్ నిర్వాహణలో అసలు అవినీతే జరగనప్పుడు ఈ కేసు ఏంటీ అని కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు కొట్టిపారేశారు. కేసులో లీగల్‌గా తేల్చుకుంటామని చెప్పారు.కాని ఏసీబీ మాత్రం ఈకేసు విషయంలో అంతకంటే దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.తప్పని సరిగా కేటీఆర్ జనవరి 6న విచారణకు హాజరవ్వాలని నోటీసులో పేర్కొంది.
ఈ కేసులో ఏసీబీ కంటే దూకుడు ప్రదర్శిస్తోన్న ఈడీ ఇప్పటికే.. కేటీఆర్‌తో సహా ముగ్గురికి వేరు వేరుగా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. జనవరి 07న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక.. బీఎల్ఎన్ రెడ్డిని జనవరి 02న, అర్వింద్ కుమార్‌ను జనవరి 03వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేయగా.. తాము హాజరు కాలేమంటూ లేఖలు రాశారు. తమకు సమయం కావాలని కోరటంతో.. జనవరి 08, 09 తేదీల్లో విచారణకు హాజరు కావాలని మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో విచారణ నిమిత్తం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మాజీ చీఫ్ ఇంజనీర్ (సీఈ) బీఎల్‌ఎన్ రెడ్డికి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది