Ys Jagan : చేసిన మంచి చెప్పుకుంటేనే గెలుస్తాం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టీకరణ.!
Ys Jagan : ‘మంచి చేస్తున్నాం.. చేసిన మంచిని గట్టిగా చెప్పుకోకపోతే ఎలా.? లబ్దిదారులకు చేయాల్సినదంతా చేస్తున్నాం. వారు మనం చేస్తున్న మంచిని గుర్తు పెట్టుకునేలా చేయడం, వారికి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి చెప్పడం ఎమ్మెల్యేలుగా మీ బాధ్యత..’ అంటూ వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కష్ట నష్టాలున్నా, బటన్ నొక్కి సంక్షేమ పథకాల్ని క్యాలెండర్ ప్రకారం అమలు చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్.
మ్యానిఫెస్టో అంటే, కేవలం ఎన్నికల ప్రచారం కోసం ఓటర్లను మభ్యపెట్టే ఓ ఉత్త వ్యవహారమనే భావన నుంచి, ఎన్నికల హామీలంటే, మాటకు కట్టుబడి నెరవేర్చాల్సినవని తాము నిరూపించామని వైఎస్ జగన్ సర్కారు చెబుతోన్న సంగతి తెలిసిందే. అయితే, సంక్షేమ పథకాల లబ్దిదారుల ఆలోచన ఒకింత భిన్నంగా వుంటుంది. ‘మా మీద అప్పులు చేసి, సంక్షేమ పథకాలతో మాకు టోపీ పెట్టి, మా నెత్తిన అప్పుల భారం మోపుతున్నారు..’ అనే భావన సహజంగానే ప్రజల్లో వుంటుంది. గతంలో చంద్రబాబు సర్కారు మీద ఇలాంటి భావనే నెలకొంది. అందుకే, చంద్రబాబుకి ఇంటిదారి తప్పలేదు 2019 ఎన్నికల్లో.
అందుకేనేమో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడా పార్టీ శ్రేణులు అలసత్వం ప్రదర్శించకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో సచివాలయానికీ 20 లక్షల చొప్పున, ఒక్కో నియోజకవర్గంలో ఏడు సచివాలయాలకు నిధులు కేటాయించడం జరుగుతుందనీ, వాటిని ఆయా సచివాలయాల పరిధిలో అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు వైఎస్ జగన్.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం చేస్తున్న మంచి పని జనం గుండెల్లో నిలిచిపోవాలనీ, అలా చేస్తేనే మొత్తంగా 175 సీట్లనూ గెలుచుకోగలుగుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎమ్మెల్యేలకు ఉద్బోధ చేశారు.