AP Three Capitals : మూడు రాజధానులపై తగ్గేదే లే.. సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్
AP Three Capitals : ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల అంశమే చర్చనీయాంశం అయింది. అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నా.. ఏపీకి మాత్రం సరైన రాజధాని లేదు. ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయిన తెలంగాణకు హైదరాబాద్ రాజధాని ఉంది కానీ.. ఏపీకి మాత్రం రాజధాని లేదు. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటించారు. కానీ.. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. అమరావతి రాజధానిగా ఉంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు అన్యాయం జరుగుతుందని భావించి.. ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అవసరం అని తేల్చి చెప్పారు. దీంతో అమరావతితో పాటు వైజాగ్, కర్నూలు మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం చట్టం కూడా చేసింది. కానీ… రాష్ట్ర రాజధానిపై చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది.
మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు మెట్లను ఏపీ ప్రభుత్వం తాజాగా ఎక్కింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. శాసన వ్యవస్థనే నిర్వీర్యం చేసేలా హైకోర్టు తీర్పు ఉందని ఏపీ ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది. మరోసారి విశాఖ పరిపాలనా రాజధానిగా ఉంటుందని సీఎం జగన్ కూడా అసెంబ్లీలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
AP Three Capitals : మరోసారి అసెంబ్లీకి రానున్న రాజధాని బిల్లు
మూడు రాజధానులపై ఏమాత్రం తగ్గడం లేదు ఏపీ ప్రభుత్వం. సుప్రీంకోర్టులో ఓవైపు పిటిషన్.. మరోవైపు మరోసారి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. వచ్చే ఎన్నికల లోపు ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కావాలని వైఎస్ జగన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇక.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖలో పరిపాలన ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. అలాగే.. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండబోతోంది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదెలా ఉంటే.. ఏపీలోకి ఒకే రాజధాని ఉండాలని, అది అమరావతే కావాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇన్ని నిరసనల మధ్య, హైకోర్టు తీర్పు మధ్య సీఎం జగన్.. మూడు రాజధానులను ఎలా ఏర్పాటు చేస్తారో వేచి చూడాల్సిందే.