YS Jagan : అమరావతి కేంద్రంగా జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!!
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది. ఇప్పటి నుంచే ఎన్నికలకు అమరావతి కేంద్రంగా జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా అమరావతి భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ 5 జోన్ భూముల కేటాయింపుపై అనుకూల తీర్పు వచ్చింది. దీంతో ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని 50 వేల మంది పేదలకు రాజధానిలో ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో 1134 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మరో 268 ఎకరాల భూమిని కేటాయించేందుకు నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.
268 ఎకరాల భూకేటాయింపుపై ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల యంత్రాంగాల నుంచి అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను ఇచ్చేందుకు తాజాగా ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. బోరుపాలెం, పిచ్చుకలపాలెం, అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లోని 268 ఎకరాల భూములకు ధర ప్రకారం భూములను కేటాయించనున్నారు. ఎస్ 3 జోన్ అయితే.. ఎకరం ధర రూ.4.1 కోట్లకు గత నెల ఏప్రిల్ 3న జరిగిన సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పుడు మాత్రం అందులో 6 శాతం ధరకు.. ఎకరానికి రూ.24.40 లక్షల చొప్పున 268 ఎకరాలను ప్రభుత్వానికి విక్రయించడానికి సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది.
YS Jagan : నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు అనే కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల కేటాయింపు
నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు అనే కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల కోసం వెచ్చించిన మౌలిక ధరలో కేవలం 6 శాతానికే విక్రయించడం కోసం సీఆర్డీఏ నిర్ణయించింది. దానిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నుంచి 168 ఎకరాలకు ప్రతిపాదన వచ్చింది. బోరుపాలెం నుంచి 2.05 ఎకరాలకు ప్రతిపాదన వచ్చింది. పిచ్చుకలపాలెంలో 20.47 ఎకరాలు, 81.09 ఎకరాలు, అనంతవరంలో 64.39 ఎకరాలను కేటాయించారు. నెక్కల్లులో 100 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లలో 168 ఎకరాలకు రూ.41.33 కోట్లు, మొత్తంగా 268 ఎకరాలకు గాను రూ.65.93 కోట్లుగా సీఆర్డీఏ నిర్ధారించింది. పేదలకు ఇచ్చేందుకు లైన్ క్లియర్ కావడంతో ఆర్ 5 జోన్ భూములను పేదలకు పంచేందుకు ఏపీ ప్రభుత్వం ఈనెల 18న ముహూర్తం పెట్టింది.